అప్పుడే క్యూ కట్టేశారు!

పాత 500, 1000 రూపాయల నోట్ల రద్దు అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక్క రోజు బ్యాంకులకు సెలవు ఇచ్చి, రెండు రోజులు ఏటీఎంలు పనిచేయవు అని చెప్పగానే జనం ఖంగారు పడిపోయారు. గురువారం ఉదయం బ్యాంకులు ఇంకా తెరవక ముందే భారీ ఎత్తున క్యూలు కనిపించాయి. దేశంలో అక్కడ, ఇక్కడ అని లేకుండా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. బ్యాంకులలో కౌంటర్ల వద్ద గుర్తింపు కార్డులు ఇచ్చి నోట్లను మార్చుకోవచ్చని, రోజుకు ఇలా ఒక వ్యక్తికి రూ. 4 వేల వరకు ఇస్తామని చెప్పడంతో, ముఖ్యంగా రోజువారీ ఖర్చులు గడవడానికి డబ్బుల కోసం చాలా మంది బ్యాంకుల వద్ద తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిల్చున్నారు.
సాధారణంగా తత్కాల్ రిజర్వేషన్ల కోసం రైల్వేస్టేషన్ల వద్ద తెల్లవారుజామున 5 గంటలకే క్యూ మొదలవుతుంది. ప్రస్తుతం బ్యాంకుల వద్ద కూడా ఇలాగే ఉంది. ఈసారి రెండో శనివారం, ఆదివారం అయినా ఆ రెండు రోజుల్లో కూడా బ్యాంకులు పనిచేస్తాయని, రాత్రి 8 గంటల వరకు బ్యాంకుల్లో అదనపు కౌంటర్ల సాయంతో కూడా కొత్త నోట్లు ఇస్తామని ప్రకటించినా… రష్ ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో పొద్దున్నే పలువురు తమ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డుల జిరాక్సు కాపీలు, డబ్బులు తీసుకుని బ్యాంకులకు బయల్దేరిపోయారు.
బ్యాంకుల వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తికి కేవలం రూ. 4వేలు మాత్రమే కౌంటర్‌లో ఇస్తామని బ్యాంకులు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇలా తీసుకున్నవారి వద్ద నుంచి కొట్టేయడానికి జేబు దొంగలు సైతం ఇదే సమయంలో సిద్ధంగా ఉంటారని, అందువల్ల ఎవరికి వారు జాగ్రత్తగా డబ్బులు దాచుకోవాలని కూడా చెబుతున్నారు. బ్యాంకులలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సందట్లో సడేమియా అన్నట్లు కష్టపడి తెచ్చుకున్న కొత్త నోట్లను కాస్తా ఎవరో జేబు దొంగలకు సమర్పించుకోవాల్సిన అవసరం లేకుండా.. ఎవరికి వారు జాగ్రత్త పడాలని అంటున్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *