క‌ర్నూలులో హాట్ టాపిక్ గా ‘04038119985’

ఎవరు చేస్తున్నారో? ఎవరు చేయిస్తున్నారో తెలీదు కానీ.. 04038119985 ఫోన్ నెంబరు నుంచి వచ్చిన కాల్ సారాంశం మాత్రం కర్నూలు సిటీ రాజకీయాన్ని వేడెక్కేలా చేసింది. ఏడాదిన్నర తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే ఎవరు అయితే బాగుంటుందన్న విషయాన్ని చెప్పాల్సిందిగా పేర్కొంటూ ఐవీఆర్ఎస్.. అదేనండి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గడిచిన రెండు రోజులుగా హైదరాబాద్ నుంచి కర్నూలు సిటీలోని పలువురికి ఫోన్లు వస్తున్నాయి.  వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్కు టికెట్ ఇవ్వాలనుకుంటే ఒకటిని నొక్కాలని.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ రెండు నొక్కాలంటూ వస్తున్న ఫోన్ కాల్స్ అధికారపక్ష నేతల్లో కొత్త తరహా చర్చకు తెర తీశాయి.

ఈ సర్వేను ఎవరు చేయిస్తున్నారన్నది ఇప్పుడు ఆసక్తకరంగామారింది. ఈ ల్యాండ్ లైన్ నెంబరు అడ్రస్ ను ట్రూ కాలర్ లో చెక్ చేస్తే.. అది కాస్తా అపోలో క్లినిక్ గా చూపిస్తుండటం విశేషం. రిలయన్స్కు చెందిన ఈ నెంబరు ద్వారా వస్తున్న ఫోన్ కాల్.. సర్వే చేపడుతుండటంతో కర్నూలు బరిలో దిగే అధికారపక్ష నేతల మధ్య సీటు పోరు షురూ అయ్యిందని చెప్పాలి.

కర్నూలు సీటు నాదంటే నాదన్నట్లుగా ఒకరికి మించి మరొకరు చెప్పుకోవటం ఎక్కువైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీటు తనకే వస్తుందని ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పుకుంటుండగా.. తాను స్థానికుడ్ని కాబట్టి తనకే సీటును చంద్రబాబు ఇస్తారంటూ భరత్ చెబుతున్నారు.  భరత్ గురించి తనకు తెలీదు కానీ తాను మాత్రం టీడీపీ నుంచే పోటీ చేస్తానని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అధినేత ఎవరికి టికెట్ ఇవ్వాలన్న విషయంపై ఎవరికి వారు.. వారికి తోచిన రీతిలో సమాధానం చెప్పుకోవటం కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఫోన్ ద్వారా సర్వే ఎవరు చేయిస్తున్నారన్నది పెద్ద చర్చగా మారింది.  టికెట్ ఎవరికి ఇవ్వాలన్న అంశంపై సర్వే ద్వారా ప్రజల్లో తమకున్న పట్టును చాటి చెప్పేందుకు ఈ ఇద్దరు నేతల్లో ఎవరో ఒకరు చేయించి ఉంటారన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివి సంప్రదాయ పొలిటీషియన్ అయిన ఎస్వీ కంటే.. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న టీజీ భరత్ చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Videos

165 thoughts on “క‌ర్నూలులో హాట్ టాపిక్ గా ‘04038119985’

Leave a Reply

Your email address will not be published.