యూరోప్‌ తో అనంతపురానికి లింక్‌…

యూరోప్‌లో విడుదలయ్యే కాలుష్యానికి… అనంతపురం కరువుకు సంబంధమేమిటని విస్తుపోతున్నారా? సంబంధం ఉంది. యూరోప్‌ కాలుష్యం కారణంగానే వాయవ్య, మధ్య భారతదేశంలో 2000 సంవత్సరంలో ఏకంగా 40 శాతం వర్షాపాత లోటు ఏర్పడిందని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. భారతదేశంలో దీని ప్రభావం వల్ల అత్యంత కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లా అనంతపురం. సుదూరంలో ఉన్న యూరోప్‌లోని కాలుష్యం మన రైతుల బతుకులను ఎలా చిధ్రం చేస్తోందో చూద్దాం..

ఎరోసాల్స్‌ కారణం: కాలుష్య కారక సూక్ష్మ కణాలను ఏరోసాల్స్‌ అంటారు. ఇవి పారిశ్రామిక కాలుష్యం ద్వారా ప్రధానంగా వెలువతాయి. తేలికగా ఉంటాయి కాబట్టి భూవాతావరణం పైపొరలకు చేరతాయి. సముద్రాల్లో ఉప్పునీటి ఆవిరి, ఎడారుల్లో ఇసుక తుఫానుల సమయంలో వెలువడే ధూళి కారణంగానూ ఏరోసాల్స్‌ ఏర్పడతాయి. అయితే ప్రధానంగా పారిశ్రామిక కాలుష్యం ద్వారా ఏర్పడే ఏరోసాల్స్‌ వర్షాపాత లోటుకు, కరువుకు కారణమవుతున్నాయి. ఈ కాలుష్య కారక సూక్ష్మ కణాలు ఏర్పడ్డాక… కొద్ది రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఉంటాయి. ఏరోసాల్స్‌ సల్ఫర్‌ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. ఇవి సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్‌ నిక్షిప్తం చేసుకోగలవు లేదా పరివర్తనం చేయగలవు. మేఘాల విస్తరణపై ప్రభావం చూపిస్తాయి. మేఘాలను కాంతిమయం చేయడం ద్వారా వర్షాలుపడే అవకాశాన్ని తగ్గిస్తాయి.

రుతుపవనాలపై ప్రభావం: చల్లని ప్రాంతం నుంచి వేడిగా ఉన్న ప్రాంతం వైపు గాలి వీస్తుంది. ఎందుకంటే చల్లని ప్రాంతంలో పీడనం ఎక్కువ. ఉష్ణ ప్రాంతంలో గాలి పలుచగా ఉంటుంది. పీడనం తక్కువ. అందుకే ఎక్కువ పీడనం (సముద్ర ఉపరితలం) ఉన్న ప్రాంతం నుంచి తక్కువ పీడన (జనావాస) ప్రాంతాలకు గాలి వీస్తుంటుంది. దీని కారణంగానే రుతు పవనాలు ఏర్పడతాయి. దక్షిణాసియాలో 70 శాతం వర్షాపాతం నైరుతి రుతుపవనాల కారణంగా నమోదవుతుంటుంది.

ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన గ్రాంథమ్‌ ఇనిస్టిట్యూట్‌లో పీహెచ్‌డీ విద్యార్థి దిల్షాద్‌ షావ్కీ దక్షిణాసియాపై ఏరోసాల్స్‌ ప్రభావంపై అధ్యయనం చేస్తున్నారు. ఈయన దక్షిణ భారతం కరువులకు యూరోప్‌ కాలుష్యం కారణమని చెబుతున్నారు. గత ఏడాది జులైలో బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఆయనతో పాటు పాల్గొన్న పలువురు వాతావరణ నిపుణులు కూడా ఇతర ప్రాంతాల్లోని ఏరోసాల్స్‌ ప్రభావం దక్షిణాసియా వర్షాలపై ఉంటోందని తేల్చిచెప్పారు.

యూరోప్, అమెరికా, చైనాల్లో విడుదలయ్యే పారిశ్రామిక కాలుష్యం కారణంగా ఆ ప్రాంతాలపై ఏరోసాల్స్‌ ఏర్పడతాయి. ఇవి అక్కడి స్థానిక వాతావరణాన్ని చల్లబరుస్తాయి.  వీటి కారణంగా వాయు పీడనాల్లో తేడా వచ్చి… సముద్రాల మీదుగా వచ్చే రుతుపవనాల క్రమం దెబ్బతింటుంది. . ఫలితంగా వర్షాపాత లోటుతో కరువుకు దారితీస్తుంది. 20వ శతాబ్దపు రెండో అర్ధభాగంలో మధ్య భారతంలో దీని కారణంగానే తరచూ తీవ్ర కరువు సంభవించిందని విస్తృత అధ్యయనంలో తేలింది.

Videos

Leave a Reply

Your email address will not be published.