న్యూఇయర్ వేళ అశీర్వచనాలేంది బాబు?

చెప్పిన మాట మీద నిలబడని అధినేత ఎవరంటే చంద్రబాబు పేరు చటుక్కున చెప్పే వాళ్లను గుర్రుగా చూస్తుంటారు తెలుగు తమ్ముళ్లు. మా అధినేత మీద ఎప్పుడూ ఏదో ఒక మరక వేసేందుకు సిద్ధంగా ఉంటారే అంటూ రుసరుసలాడుతుంటారు. అయితే.. జనాలకు చెప్పేది ఒకటి.. తాను చేసేది మరొకటన్నది బాబుకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలీదని చెప్పాలి.

కొత్త సంవత్సరం వేళ.. స్పెషల్ పూజలేంది.. అయినా.. న్యూఇయర్ ఏమీ మన పండగ కాదు.. దాన్ని ప్రత్యేకంగా జరపాల్సిన అవసరం లేదంటూ చెప్పటమే కాదు.. గుళ్లల్లో విశేష పూజలు గట్రా చేయాల్సిన అవసరమే లేదని తేల్చేశాడు. ఎలా మొదలైందో కానీ.. కొత్త సంవత్సరం వేళ  గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకోవటం అలవాటైంది.

ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా తయారై.. కొన్నేళ్లు అదో పెద్ద ఉత్సవంలా మారింది.

ఇంతకాలం ఇలాంటి విషయాల్ని పట్టించుకోని ప్రభుత్వాలకు భిన్నంగా.. బాబు సర్కారు ఈసారి న్యూఇయర్ రోజున గుళ్లల్లో హడావుడి చేయాల్సిన అవసరం లేదని తేల్చింది. దీంతో.. గుడికి వెళ్లే విషయంలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకొని.. ఇది మన పండగ కాదు ఆళ్ల పండగ అంటూ చెప్పటంతో ఎవరికి వారు కాస్త వెనక్కి తగ్గారు.

కోట్లాదిమందిని ప్రభావితం చేసిన చంద్రబాబు.. తన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇంటికి పండితుల్ని పిలిపించుకొని మరీ ఆశీర్వచనాలు తీసుకోవటం చాలామందిని అవాక్కు అయ్యేలా చేసింది. నేనేం పిలిపించలేదని బాబు చెప్పొచ్చు. ఒకవేళ ఇంటికే వస్తే.. రాష్ట్ర ప్రజలకు చెప్పాం.. నేను తీసుకుంటే బాగోదు కదా.. అయినా.. రాజ్యాధినేతగా నేను తీసుకుంటున్న నిర్ణయాల్ని ఫాలో కావటం లేదా? అని ఇంటికి వచ్చిన పండితులకు చెప్పి పంపించాల్సింది పోయి.. భార్యను పక్కన కూర్చొబెట్టుకొని ఆశీర్వచనం తీసుకోవటాన్ని ఏమనాలి?

నీతులు చెబుతాను.. అన్నింటిని ఫాలో కండి.. నేను మాత్రం కానన్నట్లుగా ఉండే బాబు తీరును పలువురు తప్పు పడుతున్నారు. తన మాటను నమ్మి లక్షలాది మంది తమ నమ్మకాన్ని పక్కన పెట్టి గుడికి వెళ్లకుండా ఉంటే.. బాబు మాత్రం ఆశీర్వచనం తీసుకోవటం సరికాదంటూ సోషల్ మీడియాలో సటైర్లు భారీగానే పడుతున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *