టాలీవుడ్‌లో భ‌యంక‌ర‌మైన స్కామ్

పైర‌సీ, ఓవ‌ర్ బ‌డ్జెట్‌, ఫ్లాపులు, పెద్ద నోట్ల ర‌ద్దు… ఇలా చిత్ర‌సీమ‌ని అత‌లాకుత‌లం చేస్తున్న శ‌క్తులు చాల‌వ‌న్న‌ట్టు మ‌రో భారీ, భ‌యంక‌ర‌మైన స్కామ్‌ టాలీవుడ్‌లో విష వృక్షంలా నాటుకుపోయింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ స్కామ్‌కి క‌ర్త క‌ర్మ క్రియ ఓ నిర్మాత అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఆయ‌న గారు చేసేదేంటంటే.. అన్ని స్టూడియోల్లోనూ, లాబుల్లోనూ, అన్ని సినిమాల సెట్ల‌లోనూ త‌న‌కంటూ ఓ మ‌నిషిని నియ‌మించుకొంటారు. అక్క‌డి నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు రిపోర్టులు ఆయ‌న‌కు వ‌స్తూనేఉంటాయి. సినిమా ఎలా ఉంది, డ్యూరేష‌న్ ఎంత‌, ఏయే సీన్లు హైలెట్ అవ్వ‌బోతున్నాయి అనే విష‌యాలు ముంద‌స్తుగా ఈ నిర్మాత‌కే తెలుస్తాయ‌న్న‌మాట‌.

ఆయ‌న‌లో ఓ పంపిణీదారుడూ ఉన్నాడు. అందుకే `సినిమా బాగుంది` అనే రిపోర్ట్ వ‌స్తే ఆ సినిమాని ఎంత రేటు పెట్ట‌యినాకొనేస్తుంటాడ‌న్న‌మాట‌. బాలేదు అంటే ఆ సినిమా జోలికే వెళ్ల‌డు. అంటే సినిమాకి సంబంధించిన స‌మ‌స్త భ‌విష్య‌త్తూ స‌ద‌రు నిర్మాత‌కి ముందే లీకైపోతుంద‌న్న‌మాట‌. దాని వ‌ల్ల తాను బాగుప‌డ‌డం ఒక ఎత్త‌యితే… స‌ద‌రు సినిమా తీసిన నిర్మాత‌ని ముంచేయ‌డం మ‌రో భ‌యంక‌ర‌మైన ఎత్తు. ‘ఆ సినిమా బాలేదంట‌.. కొన‌క్క‌ర్లెద్దు’ అనే సంకేతాలు ఈ నిర్మాత క‌మ్ డిస్టిబ్యూట‌ర్ వ‌ల్లే చాలామందికి చేరుతున్నాయ‌ని, వాళ్లు కూడా సినిమా కొన‌కుండా ప‌రోక్షంగా అడ్డుప‌డుతున్నాడ‌న్న టాక్ వినిపిస్తోంది. బ‌య్య‌ర్లు రాక‌పోతే ఆ నిర్మాత ఏం చేస్తాడు? వ‌చ్చిన రేటుకి అమ్ముకోవ‌డం మిన‌హా. దాంతో సినిమాలు తీస్తున్న నిర్మాత‌లు దారుణంగా న‌ష్ట‌పోతుంటారు.

ఓ సినిమా ఎలా ఉందో. దాని భ‌విష్య‌త్తు ఏమిటో లాబ్‌లో తేలిపోతుంది. ఎడిట‌ర్‌కి సినిమా జ‌యాప‌జ‌యాల పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉంటుంది. అందుకే వాళ్లెవ్వ‌రూ, ఏ సంద‌ర్భంలోనూ సినిమాల విష‌యంలో నోరు జార‌రు.రిపోర్ట్ ముందే చెప్ప‌రు. అది వాళ్ల నైతిక ధ‌ర్మం. అయితే ఎడిట‌ర్ల‌ని ప‌క్క‌న పెట్టి లాబ్‌లో ప‌ని చేసే అసిస్టెంట్ల‌నీ, సినిమా ప్రివ్యూలు ప్ర‌ద‌ర్శించే చోట ఆప‌రేట‌ర్ల‌నీ మచ్చిక చేసుకొన్న ఆ నిర్మాత‌.. సినిమా భ‌విష్య‌త్తుని ముందుగానే అంచ‌నా వేయ‌గ‌ల‌గుతున్నాడ‌ని చెబుతున్నారు. నిజంగానే ఇది దారుణ‌మైన విష‌యం. సినిమా పూర్త‌యి బ‌య‌ట‌క వ‌చ్చేంత వ‌ర‌కూ అందుకు సంబంధించిన ఏ విష‌య‌మూ బ‌య‌టకు పొక్క‌కూడ‌ద‌ని నిర్మాత‌లంతా జాగ్ర‌త్త ప‌డుతుంటారు. కానీ ఈయ‌న‌గారు మాత్రం ముందే.. లీకేజీలు సృష్టించ‌గ‌లుగుతున్నార‌న్న‌మాట‌. పైర‌సీల‌ను అయితే ఏదోలా అరిక‌ట్ట‌గ‌లం? ఈ లీకేజీల్ని ఎలా ఆప‌గ‌లం? చిత్ర‌సీమ‌కు ఇది క‌ఠిన స‌వాలే.

Videos

Leave a Reply

Your email address will not be published.