గూగుల్ ను షేక్ చేసిన సింధూ ”కులం”

తెలుగు జనం పోకడ చూస్తుంటే భవిష్యత్తులో దేవుళ్లకు, నదులకు కూడా కులాన్ని అంటగట్టి సొంతం చేసుకుంటారేమో అనిపిస్తోంది. ప్రస్తుతానికి జనం ప్రయాణం అటుగానే వేగంగా సాగుతున్నట్టుగా ఉంది. అందుకు మరో నిదర్శనం… రియోలో రజతపతకం సాధించి దేశానికి గర్వకారణంగా మారిన సింధు విషయంలో జనం ప్రవర్తించిన తీరే. దేశానికి పసిడి పతకం అందించేందుకు సింధు వీరోచితంగా పోరాడుతుంటే తన తెలుగువాళ్లు మాత్రం ఇంటర్నెట్‌ ముందు కూర్చుని ఆమె కులం ఏమిటని అన్వేషించారు. ప్రముఖ సర్చ్ ఇంజన్ గూగుల్‌లో సింధు కులం గురించి వెతికిన వారి సంఖ్యభారీగా ఉంది.

గూగుల్ ట్రెండ్ గణాంకాలు పరిశీలిస్తే… గత వారం రోజులుగా సింధు కులం కోసం గూగుల్‌లో నెటిజన్ లు విరగబడి వెతికారు. సెమి ఫైనల్‌ మ్యాచ్ గెలిచినప్పటి నుంచి ఈ పిచ్చి పీక్‌లోకి వెళ్లిపోయింది. జూన్‌లో లక్షా 50వేల మంది సింధు కులం ఏంటని తెలుసుకునేందుకు గూగుల్‌లో అన్వేషించారు. జులైలో ఆ సంఖ్య 90వేలుగా ఉంది. ఇక రియోలో సింధు మెరుపులు మొదలయ్యాక జులైతో పోలిస్తే ఆగస్టులో దాదాపు పది రెట్లు అధికంగా సింధు కులం కోసం గూగుల్‌లో సెర్చింగ్ జరిగింది. ఇలా వెతికిన వారిలో తెలుగు రాష్ట్రాల జనమే ఎక్కువగా ఉన్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమెరికాలోనూ సింధు కులం గురించి గూగుల్‌లో వెతుకులాట సాగింది. ఇక్కడి నుంచి వెళ్లిన మన తెలుగువాళ్లే అక్కడ కూడా కులగజ్జి వదిలిపెట్టలేక ఇలా వెతికి ఉంటారని భావిస్తున్నారు. ఇదీ మన దేశంలో, మన రాష్ట్రాల్లో కులం కంపు కొడుతున్న తీరు. అయినా సింధు తాను కేరీర్ మొదట్లో ఎంతో కష్టపడి ఉంటారు. ఆ సమయంలో ఈ కులం వాళ్లు ఆమెకు ఏమైనా అండగా నిలబడ్డారా? ఇప్పుడు ఆమె గెలవగానే కులం రంగు పులిమి సొంతం చేసుకోవడానికి!.

Videos

22 thoughts on “గూగుల్ ను షేక్ చేసిన సింధూ ”కులం”

Leave a Reply

Your email address will not be published.