సింధు ఫైనల్ కు…

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌ లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఫైనల్‌కు చేరారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్‌ పోరులో సింధు 21-7, 21-14 తేడాతో చెన్‌ యుఫె (చైనా)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సింధు.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త శ్రమించి గేమ్‌తో పాటు ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు. 40 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు ఏకపక్ష విజయం సాధించి శభాష్‌ అనిపించుకున్నారు. సుదీర్ఘ ర్యాలీలతో ఆకట్టుకున్న సింధు.. కచ్చితమైన ఎటాక్‌తో చెన్‌ యుఫెను ఆటాడుకున్నారు. ఫలితంగా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌లో సింధు వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరినట్లయ్యింది. ఆదివారం జరుగనున్న తుది పోరులో రచనాక్‌ ఇంతానాన్‌తో కానీ ఒకుహారాతో కానీ సింధు తలపడనున్నారు.

Videos