భారీ వర్షాలు.. ట్రాఫిక్ కష్టాలు

దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు ముంచెత్తాయి. నగరంలో ఉదయం ఎడ తెరపి లేకుండా కురిసన వర్షానికి రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  రోడ్లపై కిలోమీటర్లమేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణీకులు కష్టాల్లో చిక్కుకున్నారు.

ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు కుదిపేశాయి. ఉధృతంగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. వర్షం దెబ్బకు ఢిల్లీ ప్రజలు ట్రాఫిక్ కష్టాల్లో చిక్కుకున్నారు. ఉదయం ఆఫీసులకు, స్కూళ్ళకు వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్ళలోకి వచ్చేయడంతో నగరవాసులు తీవ్ర కష్టాలు పడ్డారు. అశోక్ విహార్, జసోలా, ఓక్లా, ఐఐటీ గేట్, పహర్గంజ్ రోడ్, సరై కలే ఖాన్ నుంచి డీఎన్డీ కి వెళ్ళే రింగ్ రోడ్, సరితా విహార్, డిఫెన్స్ కాలనీ, ఐఎన్ఏ, రాజ్ ఘాట్ నుంచి ఐటీవో వైపు వెళ్ళే మార్గం, అరబిందో మార్గ్, ఆనంద్ విహార్, వజిర్బాద్ ప్రాంతాలు వర్షానికి  పూర్తిగా నీటితో నిండిపోయాయి. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు మోటారిస్టులకు ఇబ్బందులు కలగకుండా ఇతర మార్గాల్లోకి తరలించారు.

పాలం అబ్జర్వేటరీ రికార్డుల ప్రకారం ఉదయం 8.30 వరకూ సుమారు 43.4 సెంటీమీటర్ల వర్షం పడగా  41.66 సెంటీమీటర్లు రికార్డ్ అయినట్లు మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. ఈ కాలంలో నగరంలో  ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రత కన్నా మూడు డిగ్రీలు తక్కువగా ఉండి 24.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. రోజంతా వర్షంకొనసాగితే ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. అలాగే అత్యధిక ఉష్ణోగ్రత 31 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *