రాక్షసుడు మూవీ రివ్యూ…

rakshasudu bellamబెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా ఐదేళ్లలో తొలిసారి ఇమేజ్‌ గురించి ఆలోచించకుండా ‘రాక్షసుడు’ సినిమా చేశారు. తమిళంలో విజయవంతమైన ‘రాచ్చసన్‌’కి తెలుగు రీమేక్‌ ఇది. మరి ఇందులో బెల్లంకొండ ఎలా కనిపించారు? వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయనకి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది?

కథ:

దర్శకుడు కావాలనేది అరుణ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) కల. ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా చేయాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. అందుకే పలు నేరాలకి సంబంధించిన వివరాల్ని దాచుకోవడం అతనికి ఓ అలవాటుగా మారుతుంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా దర్శకుడిగా అతడి కల నెరవేరదు. ఇంట్లో వాళ్ల ఒత్తిడితో తన కలని పక్కనపెట్టి, ఎస్సై ఉద్యోగంలో చేరుతాడు. ఉద్యోగంలో చేరగానే స్కూలుకి వెళ్లే బాలికల వరుస హత్యలు సవాల్‌గా నిలుస్తాయి. ఆ హత్యలు జరిగిన తీరును బట్టి, తాను అంతకుముందే సేకరించిన వివరాలతో సరిచూసుకొని ఆ కేసుపై ఓ నిర్ణయానికొస్తాడు. కానీ పై అధికారులు అరుణ్‌ మాటల్ని పట్టించుకోరు. ఇంతలో తన కోడలు కూడా హత్యకి గురవుతుంది. దాంతో ఆ కేసుని మరింత సీరియస్‌గా తీసుకొన్న అరుణ్‌ తనని పైఅధికారులు సస్పెండ్‌ చేసినా పరిశోధన చేస్తాడు. మరి ఈ హత్యల వెనక ఉన్న ఆ సైకోని అరుణ్‌ ఎలా కనిపెట్టాడు? అతను ఎవరు? స్కూల్‌కి వెళ్లే బాలికలనే ఎందుకు చంపుతున్నాడు? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

ఒక్క ఆధారం కూడా దొరక్కుండా, అత్యంత పాశవికంగా హత్యలకి పాల్పడే ఓ సైకోపై పోలీసు పరిశోధన ఎలా సాగిందన్నదే ఈ చిత్రం. పరిశోధనాత్మక కథల్లో చిక్కుముడులు ఉంటాయి. అనుమానాలు, ప్రశ్నల్ని రేకెత్తిస్తారు. ఆ తర్వాత సమాధానాలు ఒకొక్కటిగా బయటికొస్తుంటాయి. అప్పుడే  ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుడిలో కలుగుతుంటుంది. కానీ ఈ చిత్రంలో అందరూ ఊహిస్తున్నట్టు కాకుండా, ఇంకేదో కొత్త మలుపు చోటు చేసుకొంటుంది. అలా ప్రేక్షకుడు అడుగడుగునా థ్రిల్‌కి గురవుతాడు. ఈ కోవలో చిత్రం పక్కా ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ అనిపించుకొంటుంది. దర్శకుడిగా కథానాయకుడు చేసిన కొన్ని ప్రయత్నాల తర్వాత.. సినిమా నేరుగా కథలోకి వెళ్తుంది. హత్యోదంతంపై ఆరంభంలోనే కథానాయకుడు తన దగ్గరున్న సమాచారాన్ని ఇవ్వడంతో దీని వెనక సైకో ఉన్నాడని తెలిసిపోతుంది. కానీ ఆ సైకో ఎవరన్న విషయంపైనే పలు అనుమానాల్ని రేకెత్తించారు. ఆ అనుమానాల చుట్టూ పరిశోధన సాగుతున్న క్రమంలోనే.. కథ అడుగడుగునా కొత్త మలుపు తీసుకొంటుంది. ఇందులో క్లూ కనుక్కునే విధానం, సైకో ఎవరనేది కనిపెట్టే తీరు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. అయితే సైకో ఎవరన్నది తెలిశాక, కథని మరింతగా సాగదీయడమే సినిమాకి మైనస్‌గా మారింది. ట్రెండ్‌కి తగ్గ పోలీసు కథ కావడం, కథానాయకుడి ఇమేజ్‌ గురించి ఆలోచించకుండా దర్శకుడు మాతృకనే అనుసరించడం ఈ సినిమాకి కలిసొచ్చింది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. వెంకట్‌ సి దిలీప్‌ ఛాయాగ్రహణం, జిబ్రాన్‌ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. దర్శకుడు రమేష్‌ వర్మ కథపై ఆద్యంతం పట్టుని ప్రదర్శించారు.

ప్లస్ పాయింట్స్:  కథానాయకుడు, కథనం, సంగీతం, థ్రిల్లింగ్ అంశాలు

నెగెటివ్ పాయింట్స్: సుదీర్ఘ ద్వితీయార్థం

 

టైటిల్: రాక్షసుడు

రేటింగ్: 3/5

తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, కాశీ విశ్వనాథ్

సమర్పణ: హావీష్ లక్ష్మణ్ కోనేరు ప్రొడక్షన్స్

దర్శకత్వం: రమేశ్ వర్మ

సంగీతం: జిబ్రాన్

నిర్మాత: కె.యస్  రామ రావ్

 

 

 

Videos

171 thoughts on “రాక్షసుడు మూవీ రివ్యూ…

Leave a Reply

Your email address will not be published.