ఖైదీ నంబ‌ర్ 1997.. గుర్మీత్‌కు ప‌దేళ్ల జైలు శిక్ష‌

రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్‌కు ప‌దేళ్ల జైలు శిక్ష విధించారు సీబీఐ కోర్టు జ‌డ్జి జ‌గ్‌దీప్ సింగ్‌. తాను ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేశాన‌ని, ద‌య చూపాల‌ని కంట‌త‌డి పెట్టినా.. న్యాయ‌మూర్తి మాత్రం క‌రుణించ‌లేదు. గుర్మీత్‌కు ఇప్ప‌టికే వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత అత‌నికి జైలు యూనిఫాం ఇచ్చి, ఓ ప్ర‌త్యేక సెల్ కేటాయించారు. అత‌నికి ఖైదీ నంబ‌ర్ 1997ను ఇచ్చారు. అటు సీబీఐ మాత్రం జీవిత ఖైదు విధించాల‌ని వాదించింది. ఈ శిక్ష‌తో సీబీఐ సంతృప్తి చెంద‌లేదు. శిక్ష‌ను పెంచాల‌ని కోర‌నున్న‌ట్లు సీబీఐ స్ప‌ష్టంచేసింది. 15 ఏళ్ల కింద‌ట త‌న ఇద్ద‌రు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌న్న ఆరోప‌ణ‌లు గుర్మీత్‌పై ఉన్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో అత‌న్ని మూడు రోజుల కింద‌టే దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు.. ఇవాళ శిక్ష ఖ‌రారు చేసింది. తీర్పు నేప‌థ్యంలో హ‌ర్యానా మొత్తం భారీగా బందోబ‌స్తు ఏర్పాట్లు చేశారు. అయినా అత‌ని అనుచ‌రులు మాత్రం హింస‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. సిర్సాలో ఇప్ప‌టికే రెండు వాహ‌నాల‌కు నిప్పు పెట్టారు.

జ‌డ్జి ముందు ఏడ్చిన డేరా బాబా
రేప్ కేస్‌లో అడ్డంగా బుక్క‌యిన డేరా స‌చ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ దిగొచ్చాడు. ఇన్నాళ్లూ ల‌క్ష‌లాది ఫాలోవ‌ర్లు, రాజ‌కీయ నేత‌ల అండ‌దండ‌ల‌తో తన ఇష్టం వ‌చ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రించిన డేరా బాబా.. కోర్టు త‌న‌ను దోషిగా తేల్చేస‌రికి తెల్ల‌మొహం వేశాడు. తీర్పు చెప్పిన జ‌డ్జి ముందు ప్రాధేయ‌ప‌డ్డాడు. క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ద‌య చూపాల‌ని వేడుకున్నాడు. త‌క్కువ శిక్ష‌తో వ‌దిలేయాల‌ని గుర్మీత్ జ‌డ్జిని కోరాడు. రేప్ కేస్‌లో దోషిగా తేలి రోహ్‌త‌క్ జైల్లో ఉన్న గుర్మీత్‌కు శిక్ష వేయ‌డానికి జ‌డ్జే రోహ్‌త‌క్‌కు ప్ర‌త్యేక చాప‌ర్‌లో వెళ్లిన విష‌యం తెలిసిందే. జైల్లోనే తాత్కాలిక కోర్టు కూడా ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఇరు వ‌ర్గాల వాద‌న‌ను న్యాయ‌మూర్తి విన్నారు. ప‌దేళ్ల జైలు శిక్ష విధించాల‌ని సీబీఐ కోర‌గా.. సాధ్య‌మైనంత త‌క్కువ శిక్ష‌తో వ‌దిలేయాల‌ని, అత‌ను సామాజిక కార్య‌క‌ర్త అని, ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేశాడ‌ని డిఫెన్స్ వాదించింది.

జైలులో తీర్పు చెప్పిన జ‌డ్జి
ఇదో వెరైటీ తీర్పు. కాదు, చ‌ట్ట‌మే జైలుకు త‌ర‌లివ‌చ్చింది. డేరా స‌చ్చా సౌదా చీఫ్ గుర్మీత్‌పై ఉన్న రేప్‌ కేసులో తీర్పు ఇచ్చేందుకు సీబీఐ కోర్టు జ‌డ్జి జ‌గ‌దీప్ సింగ్ ప్ర‌త్యేకంగా రోహ‌త‌క్‌లోని జైలుకు రావాల్సి వ‌చ్చింది. సీబీఐ జ‌డ్జి జ‌గ‌దీప్ సింగ్ డేరా బాబా కేసులో తీర్పును వినిపించారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌ల‌ను వినేందుకు ఆయ‌న ప్ర‌తి ఒక్క‌రికి 10 నిమిషాలు కేటాయించారు. రోహ‌త‌క్ జైలులోని జైలు లైబ్ర‌రీని ఈ తీర్పు కోసం కోర్టురూమ్‌గా మార్చేశారు. సీబీఐ జ‌డ్జి జ‌గ‌దీప్ సింగ్ ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో పంచ‌కుల నుంచి రోహ‌త‌క్ చేరుకున్నారు. వాస్త‌వానికి పంచ‌కుల కోర్టులో ఈ తీర్పును ఇవ్వాలి. కానీ అక్క‌డ రాక్‌స్టార్ బాబా అనుచ‌రులు గ‌త వారం భారీ విధ్వంసం సృష్టించారు. ఇంకా అక్క‌డ వేల మంది అత‌ని అనుచ‌రులు తీర్పు కోసం వేచి ఉన్నారు. దీంతో అధికారులు ఏకంగా న్యాయ‌మూర్తినే జైలుకు త‌ర‌లించారు. రోహ‌త‌క్‌లోని సొనారియా జైలులో తీర్పు ఇవ్వ‌డం జ‌రిగింది. పంచ‌కుల నుంచి సుమారు 40 నిమిషాలు ప్ర‌యాణించిన త‌ర్వాత జ‌డ్జి జ‌గ‌దీప్ రోహ‌త‌క్ చేరుకున్నారు. తీర్పు సంద‌ర్భంగా జైలు చుట్టూ బీఎస్ఎఫ్ జ‌వాన్లను కూడా ఏర్పాటు చేశారు. బ‌రీ బందోబ‌స్తు మ‌ధ్య తీర్పు ఇవ్వ‌డం జ‌రిగింది. కోర్టు రూమ్‌లో మొత్తం 9 మంది ఉన్నారు. నిందితుడు గుర్మీత్ రామ్ ర‌హీమ్ కూడా జ‌డ్జి ముందు నిలుచున్నారు. మ‌రోవైపు గుర్మీత్‌కు చెందిన 302 కార్ల‌ను హ‌ర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 29 ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published.