లేడీ టీచర్ చేయి పట్టి లాగిన మంత్రి రావెల తనయుడి కీచకపర్వం

టీచర్ చేయి పట్టి కారులోకి లాగిన సుశీల్
* బాధితురాలి కేకలు విని సుశీల్, ఆయన డ్రైవర్‌ను చితకబాదిన స్థానికులు
*  టీచర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు
* మంత్రి తనయుడు కావడంతో కేసు నుంచి తప్పించేందుకు పోలీసుల యత్నం
* బాధితురాలి బంధువులు స్టేషన్‌కు వెళ్లి నిలదీయడంతో వెలుగులోకి వచ్చిన అసలు విషయం
* సుశీల్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు

రోడ్డుపై వెళ్తున్న మహిళా టీచర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడిని, ఆయన కారు డ్రైవర్‌ను స్థానికులు కొందరు చితకబాదారు. ఈ ఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో నివాసం ఉంటున్న యువతి (20) స్థానిక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వైట్‌హౌస్ అపార్ట్‌మెంట్ ఎదురుగా ఆ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఏపీ మంత్రి రావెల కిశోర్ కుమారుడు సుశీల్‌కుమార్, తన డ్రైవర్ అప్పారావుతో కలిసి కారులో వచ్చాడు. యువతి సమీపంలోకి రాగానే కారును స్లో చేసి, కారు ఎక్కుతావా అంటూ అసభ్యకరంగా మాట్లాడారు.

పట్టించుకోకుండా ముందుకెళ్తున్న ఆ యువతి చేయిపట్టి లాగారు. దీంతో వారి బారి నుంచి తప్పించుకొని వెళ్తుండగా ఆమె భర్త ఎదురయ్యాడు. జరిగిన విషయాన్ని భర్తతో చెప్పడంతో అతడు బైక్‌పై కారును వెంబడించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు శ్మశానవాటిక వద్ద నిలబడి ఉన్న సుశీల్‌కుమార్‌ను, డ్రైవర్ అప్పారావును చితకబాదారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్‌చేశారు.

పోలీసులు అప్పారావుపై సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ ఫిర్యాదు మేరకు అప్పారావుపై కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. తన బాస్ కుమారుడు సుశీల్ తాజ్ బంజారా సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని రమేష్ అనే వ్యక్తి రాత్రి 10గంటలకు ఫిర్యాదుచేయగా 324 కింద కేసు నమోదు చేశారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సుశీల్‌తో పాటు అప్పారావు పొటోలను మహిళా టీచర్ సెల్‌ఫోన్‌లో బంధించారు. వారిద్దరినీ స్థానికుల సమహకారంతో పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లి అప్పగించారు కూడా. అయితే, సుశీల్ పేరును ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయలేదని బాధితురాలు ఆరోపించారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో సుశీల్ తాగి ఉన్నట్లు చెబుతున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *