కమెడియన్ రమేష్‌ భార్య ఆత్మహత్యకు అదే కారణం: పోలీసులు

పైసా కట్నం తేలేదు గానీ.. దర్జాగా సోఫాలో కూర్చున్నావేంటి? .. కిందకు దిగు… ఏంటి మీ అమ్మతో ఫోన్‌లో ఏం మాట్లాడుతున్నావ్‌… కొంచెం జాగ్రత్తగా ఉండు… అలా ఖాళీగా తిని కూర్చునే కన్నా.. ఇంటి పనేదైనా చేయొచ్చుగా… ఇలాంటి సూటిపోటి మాటలను ఏడాది పాటు సహించిన త్రిపురాంభిక ఇక చావే నయమనుకుంది. బలవన్మరణానికి పాల్పడింది. డ్యాన్సర్‌, హాస్య నటుడు చదలవాడ రమేష్‌(35) భార్య త్రిపురాంభిక (22) సోమవారం శ్రీనగర్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉదయం ఆరు గంటల సమయంలో బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన త్రిపురాంభిక ఏడున్నర అయినా బయటకు రాకపోవడంతో అత్తమామలు కిటికీలోనుంచి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని కనిపించింది. గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఏడాదిలోనే అంతా అయిపోయింది..
నెల్లూరుకు చెందిన త్రిపురాంభికతో రమేష్‌కు గత ఏడాది డిసెంబర్‌ 12న వివాహమైంది. త్రిపురాంభిక అత్తమామలు, ఆడపడుచుతో కలిసి ఉంటుండగా, రమేష్‌ షూటింగ్‌లు ఉన్నప్పుడు హైదరాబాద్‌ వెళ్లి వస్తుండేవాడు. ఆదివారం రమేష్‌ విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లాడు. త్రిపురాంభిక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కుటుంబసభ్యులు తెలియజేయడంతో గాజువాక శ్రీనగర్‌ చేరుకున్నాడు. ఈ విషయాన్ని నెల్లూరులో ఉంటున్న ఆమె తల్లికి తెలియజేయడంతో వారు హుటాహుటిన విశాఖకు వచ్చారు.
గాజువాక పోలీసులకు ఫిర్యాదు..

తన కూతురుని వేధించి కడతేర్చారని త్రిపురాంభిక తల్లి పుష్పలత గాజువాక పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంగా తనను కట్నం కోసం సూటిపోటి మాటలతో వేధించారని, అత్తమామలతోపాటు ఆడపడుచు మహాలక్ష్మి, ఆమె భర్త మల్లికార్జునరావును కఠినంగా శిక్షించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ఏపీసీ రామ్మోహనరావు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అయితే భర్త రమేష్‌ ఏనాడూ తన కూతురిని వేధించలేదని, ఈ కేసులో అతడిని చేర్చవద్దని పుష్పలత కోరినప్పటికీ, అప్పటికే సెక్షన్‌ 304 బి కింద కేసు నమోదు చేయడంతో అందరినీ పోలీసులు విచారిస్తున్నారు. డ్యాన్సర్‌గా రమేష్‌కు మంచి గుర్తింపు ఉండడంతో ఆయనకు మద్దతుగా అనేక మంది డ్యాన్సర్లు, నటులు స్టేషన్‌ వద్ద పడిగాపులు కాశారు. మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు.  త్రిపురాంభిక ఆత్మహత్యకు వేధింపులే కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు వెల్లడించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *