ఆర్‌కామ్‌తో జతకట్టిన ఎయిర్‌సెల్

దేశ టెలికం రంగంలో అతిపెద్ద విలీనం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్..మలేషియా కేంద్రస్థానంగా మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్‌హడ్(ఎంసీబీ)కి చెందిన ఎయిర్‌సెల్‌తో జతకట్టింది. ఈ జాయింట్‌వెంచర్‌లో ఏర్పాటుకానున్న నూతన సంస్థలో ఆర్‌కామ్, ఎయిర్‌సెల్‌లు చెరో 50 శాతం వాటా కలిగివుండనున్నాయి.

ఈ జాయింట్ వెంచర్ రూ.35 వేల కోట్ల (520 కోట్ల డాలర్లు) నికర విలువ, రూ.65 వేల కోట్ల(970 కోట్ల డాలర్లు) విలువైన ఆస్తులు కలిగివుండనున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆర్‌కామ్‌కు చెందిన వైర్‌లెస్ వ్యాపారంను విడదీసి ఎయిర్‌సెల్‌లో విలీనం చేయనున్నది. ఒక్కో సంస్థకు ఉన్న రూ.14 వేల కోట్ల భారాన్ని నూతన సంస్థకు బదలాయించనున్నాయి. దీనికి స్పెక్ట్రం కొనుగోలుకోసం వెచ్చించిన రూ.6 వేల కోట్లు అదనంగా చేరనున్నది. దీంతో ఆర్‌కామ్ అప్పు రూ.20 వేల కోట్ల వరకు తగ్గనుండగా, ఎయిర్‌సెల్ రుణం రూ.4 వేల కోట్ల వరకు తగ్గనున్నది.

ఇరు సంస్థల వాటాదారుల విలువ దీర్ఘకాలికంగా గణనీయమైన వృద్ధిని నమోదు చేయడానికి ఈ ఒప్పందం దోహదపడనున్నదని ఆర్‌కామ్ చైర్మన్ అనిల్ అంబానీ వెల్లడించారు. నిర్వహణ వ్యయం రూ.20 వేల కోట్లుగా అంచనావేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నూతన సంస్థలో ఇరు సంస్థలకు చెందిన బోర్డు సభ్యులు సమానంగా ఉండనున్నారు. రెండు సంస్థలు విలీనమవడంతో వినియోగదారులు, ఆదాయ పరంగా దేశంలో నాలుగో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించనున్నది. ఆర్‌కామ్‌కు 11 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండగా, ఎయిర్‌సెల్‌కు 8.4 కోట్ల మంది ఉన్నారు. ఆర్‌కామ్ 9.8 శాతం మార్కెట్ వాటా కలిగివుండగా, ఎయిర్‌సెల్ 8.5 శాతంగా ఉంది. గతంలో ఎంటీఎస్.. ఆర్‌కామ్ విలీనం చేసుకున్న విషయం తెలిసిందే.

మొత్తం స్పెక్ట్రం కొనుగోలులో ఈ జాయింట్‌వెంచర్‌కు 19.3 శాతం వాటా కలిగివుండనున్నాయి. 800, 900, 1800, 2100 మెగాహెడ్జ్‌ల బ్యాండ్‌విడ్త్‌లతో ఇరు సంస్థలు సేవలు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2జీ, 3జీ, 4జీ సేవలను అందించడానికి ఈ ఒప్పందం దోహదం చేయనున్నది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ భారీ ఒప్పందం వచ్చే ఏడాది చివరినాటికి పూర్తికానున్నట్లు తెలుస్తున్నది. 2006లో ఎయిర్‌సెల్‌ను కొనుగోలు చేసిన ఎంసీబీ ఇప్పటి వరకు రూ.35 వేల కోట్లు(520 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *