పోరాడి ఓడిన హైదరాబాద్

బెంగళూరు: భారీ బ్యాటింగ్ బలగంతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తమ సత్తా చూపించింది. జట్టుపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ఐపీఎల్‌లో శుభారంభం చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 45 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఏబీ డివిలియర్స్ (42 బంతుల్లో 82; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్ కోహ్లి (51 బంతుల్లో 75; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో చెలరేగగా, చివర్లో సర్ఫరాజ్ ఖాన్ (10 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) శివమెత్తాడు. డివిలియర్స్, కోహ్లి రెండో వికెట్‌కు 87 బంతుల్లోనే 10.82 రన్‌రేట్‌తో 157 పరుగులు జోడించడం విశేషం. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20  ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. కెప్టెన్ వార్నర్ (25 బంతుల్లో 58; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

కోహ్లీ-డివిలియర్స్ షో:

బాదుడే లక్ష్యంగా బరిలోకి బెంగళూరుకు ఆదిలోనే గేల్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. భువన్వేశర్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో గేల్(1) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అయినా బెంగళూరు శిబిరంలో ఎలాంటి ఆందోళన లేదు. కారణం క్రీజులో కోహ్లీకి తోడు డివిలియర్స్ జతకలవడం ఇన్నింగ్స్ రూపురేఖలనే మార్చేసింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మొదలైన వీరి బాదుడు దాదాపు ఆఖరి దాకా కొనసాగింది. టీ20ల్లో పొదుపుగా బౌలింగ్ చేసే సీనియర్ పేసర్ నెహ్రాను కూడా విడిచిపెట్టని డివిలియర్స్(42 బంతుల్లో 82) తన ఇన్నింగ్స్‌లో 7ఫోర్లు, 6 భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. నెహ్రా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 2 ఫోర్లు, ఓసిక్స్‌తో డివిలియర్స్ 15 పరుగులు పిండుకుని తన ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరలేపాడు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ(51 బంతుల్లో 75; 7ఫోర్లు, 3సిక్స్‌లు)జతగా డివిలియర్స్ మరింత రెచ్చిపోయాడు. ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 157 పరుగుల భారీ భాగస్వామ్యంతో కదంతొక్కారు. వీరి ధాటికి ఐపీఎల్ అరంగేట్రం బౌలర్ ముస్తాఫిజుర్(4-0-26-2) మినహా అందరు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కెప్టెన్ వార్నర్‌బౌలర్లను మార్చినా లాభం లేకపోయింది. ముఖ్యంగా కోహ్లీ, డివిలియర్స్ షాట్లతో విరుచుకుపడుతున్న సమయంలో యువ పేసర్ ముస్తాఫిజుర్‌ను వార్నర్ ప్రయోగించకపోవడం అతని నాయకత్వలోపాన్ని చాటింది. కోహ్లీ ఔట్ తర్వాత క్రీజులోకొచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ వాట్సన్(8 బంతుల్లో 19)హ్యాట్రిక్ సిక్స్‌లతో చెలరేగాడు. లెగ్‌స్పిన్నర్ కర్ణ్‌శర్మ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఆఖరి మూడు బంతులను సిక్స్‌లుగా మలిచాడు.

వార్నర్ ఒక్కడే…
సహచరులనుంచి సహకారం లేకపోయినా వార్నర్ ఒక్కడే దూకుడుగా ఆడి రైజర్స్‌ను శుభారంభం అందించాడు. ధావన్ (8) విఫలమైనా, వార్నర్ మెరుపులతో పవర్‌ప్లేలో సన్ 56 పరుగులు చేయగలిగింది. 21 బంతుల్లోనే వార్నర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే వార్నర్‌ను వాట్సన్ అవుట్ చేసిన తర్వాత మరో 15 పరుగుల వ్యవధిలోనే ఓజా (0), హెన్రిక్స్ (19), హుడా (6) వెనుదిరగడంతో రైజర్స్ విజయావకాశాలకు దెబ్బ పడింది. చివర్లో ఆశిష్ రెడ్డి (18 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడినా లాభం లేకపోయింది.  సన్‌రైజర్స్ తమ తర్వాతి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో హైదరాబాద్‌లో శనివారం ఆడుతుంది. గాయం కారణంగా బెంగళూరుతో మ్యాచ్ మధ్యలో తప్పుకున్న నెహ్రా… తర్వాతి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (బి) భువనేశ్వర్ 1; కోహ్లి (బి) భువనేశ్వర్ 75; డివిలియర్స్ (సి) మోర్గాన్ (బి) ముస్తఫిజుర్ 82; వాట్సన్ (సి) ఓజా (బి) ముస్తఫిజుర్ 19; సర్ఫరాజ్ (నాటౌట్) 35; జాదవ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 227.
వికెట్ల పతనం: 1-6; 2-163; 3-183; 4-183.
బౌలింగ్: నెహ్రా 2.1-0-21-0; భువనేశ్వర్ 4-0-55-2; ముస్తఫిజుర్ 4-0-26-2; హెన్రిక్స్ 4-0-41-0; కరణ్ శర్మ 4-0-57-0; ఆశిష్ రెడ్డి 1.5-0-25-0.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మిల్నే (బి) వాట్సన్ 58; ధావన్ (బి) రసూల్ 8; హెన్రిక్స్ (సి) రసూల్ (బి) మిల్నే 19; ఓజా (సి) డివిలియర్స్ (బి) చహల్ 0; హుడా (సి) డివిలియర్స్ (బి) చహల్ 6; మోర్గాన్ (నాటౌట్) 22; ఆశిష్ రెడ్డి (బి) వాట్సన్ 32; కరణ్ శర్మ (నాటౌట్) 26 ; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182.
వికెట్ల పతనం: 1-35; 2-86; 3-88; 4-93; 5-101; 6-147.
బౌలింగ్: మిల్నే 4-0-43-1; షేన్ వాట్సన్ 4-0-30-2; రసూల్ 4-0-31-1; హర్షల్ 4-0-33-0; చహల్ 4-0-43-2.

Videos

Leave a Reply

Your email address will not be published.