ధోనీపై మళ్లీ తూటాలు: పుణెలో కలకలం

మరికొద్ది గంటల్లో ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడబోతోన్న రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ (ఆర్‌పీఎస్‌)లో  ఆ జట్టు యజమాని వ్యాఖ్యలు కలకలం రేపాయి. సంజీవ్‌ గొయాంకా ఎంఎస్‌ ధోనీని టార్గెట్‌ చేస్తూ చేసిన వ్యాఖ్యలు క్రీడావర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇప్పటికే సంజీవ్‌ సోదరుడైన హర్ష్‌ గొయాంకా ధోనీపై పేల్చిన మాటాల తూటాలు వివాదాస్పదం కావడం, వాటికి బదులుగా ధోనీ భార్య సాక్షి ఇచ్చిన ఘాటు కౌంటర్లు హైలైట్‌ కావడం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజీవ్‌ గొయాంకా.. ధోనీ, స్మిత్‌, జట్టులోని ఇతర ఆటగాళ్లగురించిన విషయాలు చెప్పుకొచ్చారు.

‘ఎంఎస్‌ ధోనీ గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు. అతని మైండ్‌ సెట్‌, గెలవాలనే తపన అమోఘం. ప్రపంచంలోనే బెస్ట్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ అతను. అయితే ధోనీ కన్నా అద్భుతమైన మైండ్‌ సెట్‌ ఉన్న ఆటగాడు ఇంకొకరున్నారు.. అతనే స్టీవ్‌ స్మిత్‌! గెలుపు తప్ప మరేదీ వద్దనుకునే యాటిట్యూడ్‌ స్మిత్‌ది. అందుకే టీమ్‌మేట్స్‌కు ‘12 బంతుల్లో 30 పరుగులు కొట్టు.. లేదా, అవుటై వచ్చెసెయ్‌..’ లాంటి సూచనలు చేస్తాడు. కష్టసమయాల్లో ఎన్నోసార్లు జట్టును ఆదుకున్నాడు. ఫుడ్‌ పాయిజన్‌ వల్ల స్మిత్‌ సరిగా ఆడని కారణంగానే ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లలో పుణె జట్టు సరిగా ఆడలేకపోయింది..’ అంటూ ఎడాపెడా స్మిత్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ, జట్టు విజయయాత్రలో ధోనీ పాత్ర ఏమాత్రం లేదన్నట్లు మాట్లాడారు సంజీవ్‌ గొయాంకా.

హైదరాబాద్‌లో ఆదివారం(మే 21న) జరగనున్న ఫైనల్స్‌లో పుణె జట్టు ముంబైతో తలపడనున్న సంగతి తెలిసిందే. 2016లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పుణె జట్టు ప్రస్థానం ఆదివారంతోనే ముగియనుంది. దీనిపైనా గొయాంకా తనదైన శైలిలో స్పందించారు. సరైన నాయకత్వం లేకపోవడం, ఆటగాళ్ల ఎంపికలో లోపాల వల్లే గత ఏడాది పుణె మెరుగ్గా రాణించలేదని గొయాంకా అన్నారు. ఈ సారి స్మిత్‌ చెప్పినట్లే.. ఇమ్రాన్‌ తాహిర్‌, బెన్‌ స్టోక్స్‌లు రాణించారని, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ త్రిపాఠి లాంటి లోకల్‌ ప్లేయర్లు మెరవడం మరింతగా కలిసి వచ్చిన అంశమని గొయాంకా అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *