నేడే లంకతో రెండో టీ20 మ్యాచ్‌

నేడే లంకతో రెండో టీ20 మ్యాచ్‌ దెబ్బకు దెబ్బ తీయాలి. పుణె ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలి. సొంతగడ్డపై మన బలాన్ని ప్రత్యర్థికి చూపించాలి. ప్రపంచకప్‌ ముందు ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాలి. మరి ధోనిసేన ఆ పని చేస్తుందా? శుక్రవారం రాంచిలో జరగనున్న రెండో టీ20లో అదరగొడుతుందా? తొలి టీ20లో షాకిచ్చిన శ్రీలంకను ఓడిస్తుందా? ఎందుకంటే ఈ మ్యాచ్‌ ఓడిపోతే సిరీస్‌ భారత్‌ చేజారుతుంది.అంతకంటే కీలకమేంటంటే టీ20 ప్రపంచకప్‌ ముందు భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదమూ ఉంది? ఈ నేపథ్యంలో ధోనీ సేనకు రాంచి టీ20 సవాలే.ఆ‌్రస్టేలియాను చిత్తుగా కొట్టి వూపు మీదున్న ధోని సేనను తొలి టీ20లో పేస్‌తో పడగొట్టి శ్రీలంక నేలకు దించింది. అనుభవం లేని కుర్ర జట్టే అనుకుంటే సీనియర్లతో కూడిన భారత జట్టుకు షాకిచ్చింది. అంతేకాదు సిరీస్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాంచి వేదికగా జరిగే రెండో మ్యాచ్‌ టీమ్‌ఇండియాకు ప్రతిష్టాత్మకంగా మారింది. టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా జరుగుతున్న సిరీస్‌లో ఇప్పటికే తొలి టీ20 చేజార్చుకున్న భారత్‌ రెండో మ్యాచ్‌లో పంజా విసురుతుందో లేదో చూడాలి. టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో ఓడితే నెంబర్‌వన్‌ ర్యాంకు కూడా కోల్పోతుంది.
కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సొంతగడ్డ.. రాంచిలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌ ఇదే! ఈ నేపథ్యంలో అందరి కళ్లు ధోని మీదే. ఇటీవల కాలంలో బ్యాట్‌ ఝుళిపించలేకపోతున్న మహి ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. గత పది టీ20ల్లో అతని సగటు 26.75. ఇది ధోని కెరీర్‌ సగటు (32.17) కంటే తక్కువే. పది మ్యాచ్‌ల్లో కనీసం అతను ఒక్కసారి కూడా 30 పరుగులు చేయలేకపోయాడు. ధోని బ్యాటింగ్‌లో రాణించడంతో పాటు జట్టును తిరిగి గెలుపు పట్టాలపై ఎక్కించాలనేది అభిమానుల ఆశ.
శ్రీలంకతో పోల్చుకుంటే భారత జట్టు సీనియర్లు, కుర్రాళ్లతో సమతూకంగా కనిపిస్తోంది. ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌ ఆస్ట్రేలియాలో మాదిరి మెరుపు ఆరంభాన్ని ఇస్తే మిడిల్‌ ఆర్డర్‌లో రహానె, రైనా, యువరాజ్‌ దాన్ని సొమ్ము చేసుకునే అవకాశం ఉంటుంది. పుణె పచ్చిక పిచ్‌పై సంయమనం పాటించకుండా చెత్త షాట్ల ఎంపికతో వికెట్లు ఇచ్చుకున్న భారత బ్యాట్స్‌మెన్‌ పాఠాలు నేర్చుకుని రాంచిలో రాణించాల్సిన అవసరముంది. పుణెలో అదరగొట్టిన లంక పేసర్లు రజిత, శనక, చమీర లను భారత బ్యాట్స్‌మెన్‌ ఎలా ఎదుర్కుంటారో చూడాలి. టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో యువరాజ్‌, జడేజా, హర్దిక్‌ పాండ్యలకు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో జోరు అందుకోవడం ఎంతో అవసరం. ధోని పేసర్లు నెహ్రా, బుమ్రాలను కొనసాగించే అవకాశముంది. అశ్విన్‌ ఫామ్‌లో ఉన్నందున హర్భజన్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కావొచ్చు. పవన్‌ నేగి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. తొలి టీ20లో నెగ్గి ఉత్సాహంతో ఉన్న యువ శ్రీలంక… రెండో మ్యాచ్‌లోనూ సత్తా చాటి సిరీస్‌ ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. రజిత, శనక, చమీరా లాంటి ప్రతిభావంతులతో ఆ జట్టు బౌలింగ్‌ బలంగా ఉంది. ఐతే స్పిన్‌కు సహకరించే రాంచి పిచ్‌పై ఆ జట్టు స్పిన్నర్లు ఏమేరకు రాణిస్తారో చూడాలి. సంగక్కర, జయవర్దనేలతో పాటు మాథ్యూస్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌ దూరం కావడంతో ఆ జట్టు బ్యాటింగ్‌ బలహీనంగా ఉంది. లంక కెప్టెన్‌ చండిమల్‌, కపుగెదెరలపైనే భారం ఉంచింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *