జియోకు షారుక్ హీరోనా? విలనా?

దేశ టెలికం రంగాన్ని ఒక ఊపు ఊపేస్తూ.. సంచలనాల మీద సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియో హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జియో సిమ్ ల కోసం బారులు తీరుతున్న ప్రజలు..వాటిని చేజిక్కించుకోవటానికి గంటల తరబడి వెయిట్ చేసేందుకు వెనుకాడని వైనం తెలిసిందే. అంత కష్టపడి సొంతం చేసుకున్న జియో సిమ్ లను తిరిగి కంపెనీకి ఇచ్చేస్తామంటూ చెబుతూ షాకిస్తున్నారు జియో కస్టమర్లు. మొన్నటి వరకూ సిమ్ ల కోసం తహతహలాడిన వినియోగదారులు అందుకు భిన్నంగా ఇప్పుడిలా రియాక్ట్ కావటానికి కారణం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

రిలయన్స్ జియోకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ బాద్షాలో దేశభక్తి భావాలు లేవని.. అతడ్ని మోసగాడిగా అభివర్ణిస్తూ సోషల్ నెట్ వర్క్స్ లో ఒక ప్రచారం షురూ అయ్యింది. షారూక్ లాంటి వ్యక్తిని జియో బ్రాండ్ అంబాసిడర్ గా నియమించటం ఏమిటని ప్రశ్నించటమే కాదు.. షారుక్ ను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించని పక్షంలో తాము తీసుకున్న సిమ్ లను తిరిగి ఇచ్చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.

షారుక్ బదులు జియోకు భారత్ తరఫున ఒలింపిక్ కు వెళ్లి పతక విజేతలుగా నిలిచిన క్రీడాకారుల్ని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించాలన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఇది నిజంగా షారుక్ మీద వ్యతిరేకతతో జరుగుతున్న ప్రచారమా? లేక.. జియోను ఇరుకున పెట్టేందుకు బాద్షాను పావుగా వాడుతున్నారా? అన్న అనుమానం కూడా కొందరు వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా.. జియోకు షారుక్ హీరోనా? విలనా? అన్న ప్రశ్నపై ఆసక్తికర చర్చ జరుగుతుందని చెప్పక తప్పదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *