285 పరుగుల ఆధిక్యంలో భారత్‌

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టుపై భారత్‌ పట్టుబిగిస్తోంది. విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌట్‌ చేసి 128 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రహానె(51 బ్యాటింగ్‌ : 93బంతుల్లో, 1×4) అర్ధశతకం సాధించగా.. మరో ఎండ్‌లో రోహిత్‌ శర్మ(41 బ్యాటింగ్‌: 57 బంతుల్లో, 1×4, 3×6) సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం భారత్‌ మొత్తం 285 పరుగుల ఆధిక్యంలో ఉంది. విండీస్‌ బౌలర్లలో కమిన్స్‌ రెండు వికెట్లు తీయగా, ఛేజ్‌ ఒక వికెట్‌ తీశాడు.

సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (5/33)తో తిరుగులేని ప్రదర్శన చేయడంతో వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకే కుప్పకూలింది. అతడి ధాటికి వెస్టిండీస్‌ 23 పరుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోవడం విశేషం. వర్షం వల్ల మూడో రోజు ఆట పూర్తిగా రద్దవగా.. 107/1తో నాలుగో రోజు, శుక్రవారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌ తొలి సెషన్లో బాగానే ఆడింది. ఓవర్‌ నైట్‌ బ్యాట్స్‌మెన్‌ బ్రాత్‌వైట్‌ (64), డారెన్‌ బ్రావో (29)ల వికెట్లు కోల్పోయి.. లంచ్‌ విరామానికి 193/3తో నిలిచింది. ఐతే రెండో సెషన్లో భువనేశ్వర్‌ విజృంభించడంతో విండీస్‌ విలవిలలాడింది. అతడి ధాటికి 202/3 నుంచి 225/10తో ఇన్నింగ్స్‌ ముగించింది. భువి.. వరుసగా బ్లాక్‌వుడ్‌ (20), శామ్యూల్స్‌ (48), హోల్డర్‌ (2), జోసెఫ్‌ (0), డౌరిచ్‌ (18)లను పెవిలియన్‌ చేర్చాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *