35 బస్సుల నిండా కార్యకర్తలతో బెజవాడకు- శ్రీశైలం ఎమ్మెల్యే

ఏపీలో టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’లో భాగంగా వైసీపీ నుంచి వలసల జోరు కొనసాగుతోంది. బుధవారం చంద్రబాబు సమక్షంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చేరికతో వైసీపీ టికెట్‌పై ఎమ్మెల్యేలుగా గెలిచి టీడీపీలోకి చేరిన వారి సంఖ్య 14కు చేరింది. తాజాగా గురువారం మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరనున్నారు.

విశాఖపట్నం జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రే విజయవాడుకు చేరుకున్నారు. మరోవైపు కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిన్న రాత్రే తన అనుచరులతో కలిసి విజయవాడ బయల్దేరారు. వీరిద్దరూ కూడా ఈరోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. తాజాగా వీరిద్దరి చేరికతో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరనుంది. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం నుంచి గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరకముందే తన స్పీడ్‌ను ప్రదర్శించాడు.

బుధవారం వరకు వైసీపీ ఎమ్మెల్యేగానే కాక ఆ పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్‌గా ఉన్న బుడ్డా రాజశేఖరరెడ్డి వైసీపీ నుంచి నేడు టీడీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. తన చేరిక గ్రాండ్‌గా ఉండాలని అనుకున్నాడో ఏమో గానీ, 35 బస్సుల నిండా తన కార్యకర్తలతో బుధవారం రాత్రి విజయవాడకు బయలుదేర్దాడు. అంతేకాదు బుడ్డా రాజశేఖరరెడ్డికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుకున్న క్రమంలో తన ఫేస్‌బుక్ ఫ్రొఫైల్‌‌ను కూడా మార్చేశారు. పార్టీ మారడానికి ఒక రోజు ముందుగానే ఆయన ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *