16 వేల కోట్ల‌కు బిడ్‌.. స్టార్ చేతికి ఐపీఎల్ హ‌క్కులు

బీసీసీఐ పంట పండింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) మీడియా హక్కుల కింద వేల కోట్లు వ‌చ్చి ప‌డ్డాయి. వ‌చ్చే ఐదేళ్ల కాలానికి గాను (2018-22) స్టార్ ఇండియా ఈ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. టీవీ బ్రాడ్‌కాస్టింగ్‌తోపాటు డిజిట‌ల్ (ఇంట‌ర్నెట్‌, మొబైల్‌) హ‌క్కులను కూడా రూ.16,347.50 కోట్ల రికార్డు ధ‌ర‌కు స్టార్ ద‌క్కించుకుంది. ఇండియాతోపాటు ఇండియా ఉప‌ఖండం, ప్ర‌పంచ హ‌క్కుల‌ను కూడా స్టార్ ఇండియానే సొంతం చేసుకోవ‌డం విశేషం. ఈ విష‌యంలో చివ‌రి వ‌ర‌కు సోనీ నెట్‌వ‌ర్క్‌తో గ‌ట్టి పోటీ ఎదుర్కొన్న‌ది స్టార్ ఇండియా. చివ‌రికి అంద‌రి కంటే అత్య‌ధిక బిడ్ దాఖ‌లు చేసి హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. అంటే ఇప్ప‌టివ‌ర‌కు సోనీలో వ‌చ్చిన ఐపీఎల్ లైవ్ ఇక స్టార్‌లో రానున్న‌ది. తొలి ప‌దేళ్ల‌కుగాను బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ కోసం 2008లో సోనీ రూ.8200 కోట్లు చెల్లించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడే ఐదేళ్ల‌కే దానికి రెట్టింపు మొత్తం స్టార్ బీసీసీఐకి చెల్లించ‌నుంది. అయితే బ్రాడ్‌కాస్టింగ్‌తోపాటు డిజిట‌ల్ హక్కులు కూడా ఇందులో ఉన్నాయి.

స్టార్ తాజా బిడ్‌తో టీమిండియానే మించిపోయింది ఐపీఎల్‌. టీమిండియా ఆడే ఒక్కో మ్యాచ్‌కు ఫీజు రూ.43 కోట్లు ఉండ‌గా.. ఇక నుంచీ ఒక్కో ఐపీఎల్ మ్యాచ్ ఫీజు రూ.55 కోట్లకు చేర‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కో మ్యాచ్‌కు కేవ‌లం రూ.15 కోట్లు మాత్ర‌మే ఉండేది. అది ఏకంగా మూడు రెట్లు పెరిగింది. ఐపీఎల్ పరంగా ఇది మ‌న‌కు భారీ మొత్త‌మే అయినా ప్ర‌పంచంలోని మిగ‌తా స్పోర్ట్స్‌తో పోలిస్తే మాత్రం ఇది త‌క్కువే అనిపిస్తుంది. అమెరికాలో జ‌రిగే నేష‌న‌ల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్‌)కు 600 కోట్ల డాల‌ర్లు ఉండ‌గా.. ఐపీఎల్ కేవ‌లం 50 కోట్ల డాల‌ర్ల ద‌గ్గ‌రే ఉంది. ఇక ఇంగ్లండ్‌లో జ‌రిగే ప్రిమియ‌ర్ లీగ్ ఫుట్‌బాల్ మీడియా హ‌క్కుల విలువ 500 కోట్ల డాల‌ర్లు కాగా.. నేష‌న‌ల్ బాస్కెట్‌బాల్ అసోసియేష‌న్ 266 కోట్ల డాల‌ర్లుగా ఉంది. ఈ లెక్క‌న ఐపీఎల్‌కు స్టార్ చెల్లిస్తుంది చాలా త‌క్కువే అనిపించ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published.