జేసీ బ్రదర్స్‌ను కాపాడేందుకు పడరాని పాట్లు

కృష్ణా జిల్లా నందిగామ వద్ద జరిగిన దివాకర్‌ ట్రావెల్స్‌ ఘోర బస్సు ప్రమాద ఘటనలో దోషులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. టీడీపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేను ప్రమాదం నుంచి బయట పడేయడానికి శతధా ప్రయత్నిస్తోంది. బస్సు ప్రమాద ఘటనపై చంద్రబాబు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో వాటి నుంచి బయట పడటానికి పాట్లు పడుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు తన పార్టీ ఎంపీది కావడం.. ఆ బస్సుకు రెండవ డ్రైవర్‌ లేకపోవడం.. పోస్టుమార్టం చేయకుండానే డ్రైవర్‌ మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రతిపక్ష నేత నిలదీయడంతో మొత్తం ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది. అందులో భాగంగానే సాక్షాత్తు క్యాబినెట్‌నే వేదికగా చేసుకుని ప్రతిపక్ష నేతపై ఎదురు దాడికి దిగారు.

మరోవైపు ఒక్క హామీ నెరవేర్చక పోవడంతో రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం లేదు. కర్నూల్లో గంగుల కుటుంబం జగన్‌ వెంట నడవడంతో టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫిరాయింపుదారులను తిరిగి ఎన్నికల్లో నిల్చోబెట్టి గెలిపించుకోలేని దయనీయ పరిస్థితి. అనంతపురంలో జేసీ బ్రదర్స్‌ను పార్టీలో చేర్చుకున్నప్పుడు మంత్రి పదవులు ఆశ చూపారు. తీరా మూడేళ్లయినా ఆ ఊసే లేదు. ఇప్పుడు కూడా వారిని వెనకోసుకురాకపోతే అక్కడా అదే పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి క్యాబినెట్‌ను వేదికగా చేసుకుని ప్రతిపక్ష నేతపై గోబెల్స్‌ ప్రచారానికి తెరలేపారు.

క్యాబినెట్‌లో ఏమి జరిగి ఉండాలి..
బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించి.. పలు సందేహాలు లేవనెత్తడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయారు. ఈ విషయాలన్నింటినీ జగన్‌ తప్పకుండా త్వరలో పారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తారని, గట్టిగా నిలదీసి ప్రశ్నల వర్షం కురిపిస్తే తన పరువు గంగలో కలుస్తుందని ఏకంగా పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత పైనే కేసు పెట్టారు. క్యాబినెట్‌ మీటింగ్‌లో ఆసాంతం ఇదే విషయమై చర్చలు జరిపారు. జగన్‌ ఘటనా స్థలిలో పర్యటించినప్పటి వీడియోను క్యాబెనెట్‌ మీటింగ్‌లో పలుమార్లు వీక్షించి పోస్టుమార్టం చేయకుండా మృతదేహాలను ఎలా తరలిస్తారని ప్రతిపక్ష నేత నిలదీసి అడగడమే పాపమన్నట్లు తీర్మానించేశారు.

వాస్తవానికి భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌.. అంటే చాలా దూరం. నిజానికి ఆ బస్సులో రెండవ డ్రైవర్‌ లేడని తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం తర్వాత ఇతనే రెండవ డ్రైవర్‌ అని ఎవర్నో చూపారు. బస్సుకు స్పీడ్‌ గవర్నెన్స్‌ కూడా లేవు. జగన్‌ పర్యటన తర్వాత బయట పడిన ఈ విషయాలన్నింటినీ ఇసుమంతైనా పట్టించుకోలేదు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? డ్రైవర్‌ తప్పిదం ఏమిటి? మృతుల కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి? దోషులకు శిక్ష పడాలంటే ఏం చేయాలి? ఏ తరహా విచారణ జరిపించాలి? భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తదితర విషయాలు నిమిషం పాటు కూడా చర్చించిన పాపాన పోలేదు. అంతకు ముందే అధికారుల సంఘాన్ని ఉసి గొల్పినా అనుకున్నంత ఫలితం రాలేదని భావించి, జగన్‌.. కలెక్టర్‌ను ప్రశ్నించడమే తప్పు అన్నట్లు విస్తృత ప్రచారం చేసేలా వ్యూహం రూపొందించారు. జరిగిన విషయాన్ని వక్రీకరించి, లీకులిచ్చి.. ప్రభుత్వ అనుకూల మీడియాలో ‘ఇదేం పద్ధతి’ అంటూ చిలువలు పలువలు చేసి రాయించుకున్నారు.

పరామర్శకు వెళ్తే అంత ఉలికిపాటు ఎందుకు? భయమెందుకు?
ఘటన స్థతికి ప్రతిపక్షనేత జగన్‌ వెళ్లాడనగానే ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళనకు లోనైనట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి బస్సు ప్రమాదం చోటు చేసుకున్న రోజు ప్రమాద స్థలానికి దగ్గరలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కానీ, ఆ జిల్లాకు చెందిన మంత్రులు కానీ అక్కడికి వెళ్లలేదు. కేసును పక్కదారి పట్టించేలా అధికార యంత్రాంగానికి ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించి ఆసుపత్రికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్, వైద్యులు, ఇతర అధికారులు జగన్‌ వెంట హాలు లోపలకు వెళ్లారు. ఆ హాలులో అప్పటికే మీడియా ప్రతినిధులు, మృతుల బంధువులు ఉన్నారు. ఆ హాలులో బంధువులకు అప్పగించడానికి ప్యాక్‌ చేసి ఉంచిన మృతదేహాలు ఓ వైపు కనిపించాయి. అదో.. అది డ్రైవర్‌ మృతదేహం అని ఎవరో చూపించారు. పోస్టుమార్టం చేశారా అని జగన్‌ వైద్యులను అడిగారు.

ఒకింత తడబాటుతో వైద్యుడు ‘లేద’ని సమాధానమిచ్చారు. దీంతో వైద్యుల వద్ద ఉన్న పోస్టుమార్టం మూడు కాపీల్లోంచి ఒకదానిని జగన్‌ అడిగి తీసుకుని మీడియా ప్రతినిధులకు అక్కడ జరుతుతున్న విషయాన్ని వివరించారు. ‘బస్సు డ్రైవర్‌ మద్యం సేవించాడా? లేదా? అనేది తెలియాలంటే పోస్టుమార్టం తప్పని సరి.   పోస్టుమార్టం చేయకుండా మృతదేహాన్ని ఎలా అప్పగిస్తారు? కలెక్టరే దగ్గరుండి తప్పు చేయిస్తే ఎలా? చట్ట విరుద్ధంగా ఇలా చేస్తే మీతో పాటు ఇందులో ప్రమేయమున్న వాళ్లంతా జైలుకు వెళ్తారు’ అని జగన్‌ కలెక్టర్‌ను గట్టిగా నిలదీశారు. దీంతో ‘అవన్నీ ఇక్కడేం పని..పదండి’ అంటూ ‘పోస్టుమార్టం చేశామ’ని చెప్పండని కలెక్టర్‌ వైద్యులకు ప్రాంప్టింగ్‌ ఇవ్వడం వినిపించింది. కలెక్టర్‌ సూచనలతో వైద్యుడు.. జగన్‌ చేతిలో ఉన్న ఆ రిపోర్టును తిరిగి లాక్కునేందుకు యత్నించారు.

ఇలా ఎందుకంటే..
సీఎం చంద్రబాబు జేసీ సోదరుల్లో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వక పోవడంతో అప్పుడప్పుడు ఎంపీ జేసీ పరోక్షంగా ఎత్తిచూపుతూనే ఉన్నారు. ఈ తరుణంలో వారిపై బస్సు ప్రమాద కేసు పెడితే అసలుకే ఎసురొచ్చి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో పక్కదారి పట్టించారని స్పష్టమవుతోంది. మరో వైపు కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితి బాగోలేదననే ఆందోళన ఆయనలో రోజురోజుకూ తీవ్రమవుతోంది. భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వెళ్లాక గంగుల కుటుంబం వైఎస్సార్‌సీపీలో చేరడం, శిల్పా మోహన్‌రెడ్డి గుర్రుగా ఉండటం పట్ల ఏం చేయాలో తోచక చంద్రబాబు తల పట్టుకున్నారు. ఈ స్థితిలో జేసీ సోదరులతో వైరం పెంచు కోవడానికి బాబు ఏ మాత్రం ఇష్టపడలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఒక అబద్ధాన్ని పదిమార్లు పదే పదే చెప్పి.. అసలు విషయం మరుగున పడేలా చేసి, అబద్ధ మే అసలు నిజమని జనాన్ని నమ్మించాలనే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇందుకు క్యాబినెట్‌ సమావేశాన్నే వేది కగా చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *