సుష్మాస్వరాజ్ గుండెపోటుతో హఠాన్మరణం

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం గుండెపోటుతో మరణించారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఆమె గుండెపోటుకు గురవడంతో, అపస్మారక స్థితిలో ఉన్న సుష్మాను హుటాహుటిన ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లోని ఎమెర్జెన్సీ వార్డ్‌కు తీసుకువచ్చారు. దాదాపు గంటపాటు ఆమెను కాపాడేందుకు వైద్యులు విఫలయత్నం చేశారు. కానీ రాత్రి 10.50 గంటల సమయంలో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 2016లో సుష్మాస్వరాజ్‌కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ అనారోగ్యం కారణంగా చూపి ఆమె పోటీ చేయలేదు.

లోక్‌సభలో ఆర్టికల్‌ 370 రద్దు బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీని అభినందిస్తూ మంగళవారం సాయంత్రమే ఆమె ట్వీట్‌ చేశారు. ‘నరేంద్ర మోదీజీ.. చాలా చాలా కృతజ్ఞతలు ప్రధాని గారు. ఈ రోజు కోసమే నేను ఎదురుచూస్తున్నాను’ అని ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్‌ ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే హుటాహుటిన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, హర్షవర్ధన్, స్మృతి ఇరానీ, ప్రకాశ్‌ జావడేకర్‌ సహా పలువురు కేంద్రమంత్రులు, నేతలు ఎయిమ్స్‌కు చేరుకున్నారు. సుష్మాస్వరాజ్‌ మృతికి రాష్ట్రపతి కోవింద్‌ తీవ్ర సంతాపం తెలిపారు. విదేశాల్లో ఆపదల్లో ఉన్న భారతీయులకు సాయమందించేందుకు ఎప్పుడూ ముందుండేవారని, ప్రజా సేవలో ఆమె సేవలు మరవలేనియని ప్రధాని పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్‌ ఆకస్మిక మృతికి షాక్‌కు గురి చేసిందని కేంద్రమంత్రులు జైశంకర్, రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్‌ మృతి తమనెంతో బాధకు గురి చేసిందని కాంగ్రెస్‌ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది.

అందరికీ ఆప్తురాలయిన సుష్మా హఠాన్మరణం ఆమె సన్నిహితులకు, అభిమానులకు దిగ్భ్రాంతిని కలిగించింది. సుష్మాస్వరాజ్‌కు భర్త స్వరాజ్‌ కౌశల్, కూతురు బన్సురి ఉన్నారు. సుష్మాస్వరాజ్‌ మృతదేహాన్ని దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలవరకు ప్రజల సందర్శనార్థం ఉంచుతామని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఆ తరువాత లోధీ రోడ్డులో అంత్యక్రియలు జరుగుతాయన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.