టార్గెట్‌ శశికళ?

అమ్మ’లేని తమిళనాడులో ఏదో జరుగుతోంది! మొన్నటికి మొన్న… రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ సారథిగా ఉన్న చీఫ్‌ సెక్రటరీ రామ్మోహన్‌ రావు ఇంటిపైనే ఐటీ దాడులు జరిగాయి! రేపోమాపో… తమిళనాడులో రాజకీయంగా అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న వారిపైనా ఐటీ/ఈడీ గురి పెట్టవచ్చునని తెలుస్తోంది. అది కూడా… సాక్షాత్తూ ‘చిన్నమ్మ’ శశికళ కొలువైన ‘పొయెస్‌ గార్డెన్‌’ బంగళాలోనే ఐటీ అధికారులు అడుగుపెట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. జయ మరణం తర్వాత… ఇప్పటిదాకా తమిళనాడులో ఎనిమిది మంది రాజకీయ, అధికార ప్రముఖులపై ఐటీ సోదాలు జరిగాయి. రెండు రోజుల క్రితం పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ, ఇతర శాఖల సిబ్బందిని చెన్నైకి రప్పించారు. కేంద్ర బలగాలను కూడా అదే స్థాయిలో మోహరించారు. ఈ నేపథ్యంలో… ‘ప్రముఖులు’ లక్ష్యంగా ఐటీ సోదాలు జరిగే అవకాశమునట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇక… పార్టీ పదవి, ముఖ్యమంత్రి పదవిలో ఏది తీసుకున్నా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ‘ఢిల్లీ’ నుంచి శశికళకు హెచ్చరికలు జారీ అయినట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా, శశికళకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలే ఆమె భవిష్యతను నిర్ణయిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఈ సంబంధాలు అంత సాఫీగా లేవని ఇప్పటికే జరిగిన పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. కాంట్రాక్టర్‌ శేఖర్‌ రెడ్డి, ‘మాజీ’ సీఎస్‌ రామ్మోహన్‌ రావుతోపాటు పలువురిపై జరిగిన ఐటీ సోదాలే దీనికి నిదర్శనం. దీంతో… తమిళనాట మున్ముందు ఏం జరగనుందన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ‘‘రాష్ట్రంలో ఐటీ, ఈడీ దాడుల వెనుక ఒక పద్ధతి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. కొందరు వ్యక్తులకు కేంద్రం ఈ రూపంలో సంకేతాలు పంపిస్తోంది. అధికారాన్ని ఒక్క కుటుంబం అప్రజాస్వామిక పద్ధతిలో సొంతం చేసుకునేందుకు అనుమతించరాదని కేంద్రం భావిస్తోంది’’ అని అన్నాడీఎంకే సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా… శశికళ బృందంలో ఆమె భర్త నటరాజన్‌, దివాహరణ్‌, దినకరన్‌, ఎస్‌.వెంకటేశ్‌, శివకుమార్‌, ఇళ్లవరసిపై కేంద్రం అనుమానపు చూపులు చూస్తోందని తమిళనాడుకు చెందిన బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘శశికళను మినహాయిస్తే మిగిలిన వాళ్లను జయ దగ్గరికి రానివ్వలేదు. కానీ, జయ కన్నుమూత తర్వాత వీరే మళ్లీ రంగంలోకి వచ్చారు. పార్టీ శ్రేణులకు ఆదేశాలిస్తున్నారు. ఇలాంటి వాళ్ల చేతిలో అధికారం కేంద్రీకృతం కాకూడదని కేంద్రం భావిస్తోంది’’ అని ఒక అధికారి చెప్పారు.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *