ఇంత మోసం చేస్తారా?: చంద్రబాబుపై టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిప్పులు

తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ ఎంపీ శివప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం దళితులను విస్మరిస్తే ఊరుకోనని హెచ్చరించారు. అంబేద్కర్ జయంతి సభలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. అంబేద్కర్ జయంతిని సంవత్సరం పొడవునా నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.

గత కొన్నేళ్లుగా జిల్లా కలెక్టర్.. అంబేద్కర్ జయంతికి హాజరుకాకుండా దళితులను అవమానపరుస్తున్నారని శివప్రసాద్ మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా దళిత భూములను లాక్కున్న ప్రభుత్వం.. దళితులను శ్రామికులుగా మార్చిందని మండిపడ్డారు.

అంతేగాక, ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎస్సీలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం తమకు ఐదు కేబినెట్ మంత్రి పదవులు ఇవ్వాల్సివుండగా రెండే మంత్రి పదవులిచ్చి వదిలేశారని అన్నారు.

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మాల, మాదిగలకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఇచ్చిన హామీల మాటేంటని ప్రశ్నించారు. అడుగడుగునా ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్సీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదన్నారు. రాయలసీమకు అన్యాయమే చేస్తున్నారని అన్నారు. కేంద్రమంత్రి పదవి కూడా ఎస్సీలకు ఇవ్వలేదన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత పలువురిలో తీవ్ర అసంతృప్తి నెలకొని వుందని తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published.