క్షమాపణ చెప్తే సరి లేదంటే కేఈపై సస్పెన్షన్ వేటు?

రాజ్యసభ ఎన్నికలు ఏపీ టీడీపీలో పెను కలకలాన్ని సృష్టించాయి. రాజ్యసభ సీటును టీజీ వెంకటేశ్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ కర్నూలు టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన కేఈ ప్రభాకర్‌ను పార్టీ సస్సెండ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే… టీడీపీకి వచ్చే మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి మిత్రధర్మంలో భాగంగా బీజేపీకి కేటాయించగా మిగతా రెండింటిలో ఒకటి కేంద్ర మంత్రి సుజనా చౌదరికి, మరొక సీటను కర్నూలు జిల్లాకు చెందిన టీజీ వెంకటేశ్‌కు అధినేత చంద్రబాబు కేటాయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రాజ్యసభ సీటుని టీజీ వెంకటేశ్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ధర్నాకు దిగారు. పార్టీకి చిరకాలంగా సేవ చేస్తున్న వారిని కాదని, పార్టీలోకి కొత్తగా వచ్చిన టిజి వెంకటేష్ కి రాజ్యసభ సీటు కేటాయించడం అన్యాయం అని, ఇలాగైతే జిల్లాలో పార్టీని భూస్థాపితం చేస్తానని అన్నారు.

టీడీపీని కూకటి వేళ్ళతో సహా పెకలించివేస్తానని ఆగ్రహంతో ఊగిపోయారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ ఆయన అనుచరులు సైతం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం ఏంటని అధినేత చంద్రబాబు కూడా ప్రభాకర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఈ విషయమై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ “టీడీపీ క్రమశిక్షణకి మారుపేరు. క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీకి ఎవరు చెడ్డపేరు తెచ్చినా చర్యలు తప్పవు. పదవి దక్కలేదని రోడ్ల మీదకి వచ్చి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సహించబోము. తమ్ముడైనా.. కుమారుడైన సరే!” అని శుక్రవారం మీడియాతో అన్నారు. అయితే జరిగిన దానిపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కలిసి క్షమాపణలు చెపితే ఇంతటితో మందలింపుతో సరిపెట్టవచ్చని లేదంటే ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Videos

2,039 thoughts on “క్షమాపణ చెప్తే సరి లేదంటే కేఈపై సస్పెన్షన్ వేటు?