లక్ష్మీస్ ఎన్టీఆర్: వర్మ కొత్త కోణం లాగుతారా, టిడిపిలో అందుకే ఆందోళనా?

లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలోని ఓ కోణాన్ని తీస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ఇది చర్చనీయాంశంగా మారింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పైన ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తున్నారు. వారు స్పందించడానికి రెండు రకాల కారణాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిర్మిస్తున్నారు. అయితే, ఆ వ్యక్తి సినిమాను నిర్మిస్తానని తన వద్దకు వచ్చినప్పుడు వైసిపి నాయకుడిగా తనకు తెలియదని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఏదేమైనా ఈ సినిమా నిర్మాణం వైసిపి నాయకుడిది కావడం కూడా టిడిపి ఆందోళనకు కారణంగా కనిపిస్తోంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై టిడిపి ఆందోళనకు మరెన్నో కారణాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌కు లక్ష్మీపార్వతి పరిచయం, పెళ్లి దగ్గరి నుంచి ఆయన మృతి చెందే వరకు మాత్రమే సినిమా తీస్తానని వర్మ ప్రకటించారు.

రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి అంశాన్ని తీసుకోవడం టిడిపికి ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ సినిమాను ఒకే యాంగిల్‌లో తెరకెక్కిస్తారేమోని, ఇంకే విషయాలు ప్రస్తావిస్తారోననే ఆందోళనలో వారిలో ఉందని అంటున్నారు.

దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం హఠాత్తుగా తాను లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోనున్నట్లు ఎన్టీఆర్ తిరుపతి బహిరంగ సభలో ప్రకటించారు. ఆయన హఠాత్తుగా అలా ప్రకటించడం వెనుక ఏదైనా దాగి ఉందా అనే యాంగిల్‌ను, కొత్త కోణాన్ని రామ్ గోపాల్ వర్మ వెల్లడిస్తారా అనే చర్చ సాగుతోంది.

అంతేకాకుండా, ఎన్టీఆర్ చివరి రోజుల గురించి చెప్పాలంటే వైస్రాయ్ హోటల్ గురించి మాట్లాడాల్సిందే. వైస్రాయ్ ఘటనపై ఆయన ఏం చెబుతారనే ఆసక్తికర చర్చ సాగుతోంది.

వైసిపి నేత నిర్మిస్తున్న సినిమా కాబట్టి, లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఓ కోణం మాత్రమే తీస్తున్న ఈ సినిమాలో.. వైస్రాయ్ ఘటనలో చంద్రబాబును లాగి, ఆయనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తారేమోనని టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.