ఫిరాయింపుదారుల్లో వీళ్లకి టికెట్లు దక్కవా?

ఇప్పటికే చాలా మంది సిట్టింగులకు వచ్చే సారి టికెట్లు దక్కవనే సంకేతాలను ఇచ్చేశారు తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సిట్టింగులు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని.. వాళ్లకు టికెట్లు ఇవ్వనని.. సర్వేలు చేయించుకునే టికెట్ల సంగతి తేలుస్తాను అని చంద్రబాబు పలు సార్లు ప్రకటించుకొంటూ వస్తున్నారు కూడా. సర్వేల మీదే వచ్చే ఎన్నికల టికెట్ల పంపకం ఉంటుందని బాబు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సర్వేల ఫలితాలు కూడా వెల్లడి అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ప్రత్యేకించి 40 మందికి పైగా సిట్టింగులు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని బాబాబు వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వాళ్లంతా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వాళ్లే. వాళ్లలో బాబు బామ్మర్ది బాలయ్య కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఆ సంగతలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం లోకి ఫిరాయించిన వాళ్లలో కూడా సగం మంది పరిస్థితి ఇదేనని తెలుస్తోంది. వీళ్లు కూడా తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని బాబు సర్వేలు తేల్చి చెప్పాయట.

వీళ్లంతా గత ఎన్నికల్లో నెగ్గింది వైకాపా ఇమేజ్ మీద, జగన్ ఇమేజ్ మీద ఆధారపడే తప్ప.. వీళ్లంతా వ్యక్తిగత ఇమేజ్ తో నెగ్గింది లేదని స్పష్టం అయ్యిందట తెలుగుదేశం అధినేతకు. సర్వేల సారాంశం ఇదేనని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వీళ్లకు టికెట్లు ఇస్తే నిండా మునిగినట్టే అనే అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ నుంచినే వినిపిస్తుండటం విశేషం.

ఈ విధంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల జాబితాల ఇలా ఉందని సమాచారం…జమ్మలమడుగు ఎమ్మెల్యే కమ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి, బీకామ్ లో ఫిజిక్స్ జలీల్ ఖాన్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, రిజర్వడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే జయరాములు, ముందుగా ఫిరాయించిన వారిలో ఒకరైన జ్యోతుల నెహ్రూ, మరో మంత్రి సుజయ రంగారావు, ఇటీవల జంపింగ్ చేసిన వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా.. వీళ్లలో ఎవ్వరూ మళ్లీ నెగ్గే అవకాశం లేదనే రిపోర్టు అందిందట చంద్రబాబు నాయుడికి. స్వయంగా చేయించుకున్న సర్వేలతోనే ఈ విషయంపై స్ఫష్టత వచ్చిందట. దీంతో వీళ్లందరికీ టికెట్లు గోవిందేనని సమాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published.