‘కంటెంట్’ అంటే ఇదీ..: నీది నాది ఒకే కథ ట్రైలర్..(వీడియో)

సెల్యూలాయిడ్ మీద ఎన్నో కథలు వస్తుంటాయి, పోతుంటాయి. థియేటర్ నుంచి బయటకు రాగానే.. ఏం కథరా బాబు? అని తల బాదుకునే సినిమాలే అందులో ఎక్కువగా ఉంటాయి. చెప్పుకోదగ్గవి గుర్తుంచుకోదగ్గవి మాత్రం అతికొద్దివి మాత్రమే ఉంటాయి. చూస్తుంటే.. ‘నీది నాది ఒకే కథ’ కూడా ఇప్పుడా జాబితాలో చేరేలా ఉంది. ట్రైలర్ విడుదలయ్యిందో లేదో.. ఇది కంటెంట్ ఉన్న కథ అని తీర్మానించేశారు ఆడియెన్స్.

ఇంతకుముందు విడుదల చేసిన టీజర్ లాగే ‘నీది నాది ఒకే కథ’ ట్రైలర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. చదువంటే నిరాసక్తి.. ఆత్మ న్యూనత నుంచి బయటపడి ఎలాగైనా విజయం సాధించాలనే కసి ఉన్న పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. ట్రైలర్ లో చూపించిన సన్నివేశాల్లో శ్రీవిష్ణు ఎమోషన్స్ పలికించిన తీరుకు మంచి మార్కులే పడుతున్నాయి.

హీరో క్యారెక్టరైజేషన్ ఎలివేట్ అయ్యేలా దర్శకుడు వేణు ఊడుగుల ఈ ట్రైలర్ కట్ చేశారని చెప్పవచ్చు. హీరో పాత్ర చుట్టూ ఉండే ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా.. ప్రధానంగా తండ్రి-కొడుకుల మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌లో.. సగ భాగం సరదాగా సాగిపోగా.. మిగతా సగం కథలోని సీరియస్‌నెస్‌ను ఎలివేట్ చేసింది.

హీరో-హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా రొటీన్ కు భిన్నంగా.. కొత్తగా తెరకెక్కించినట్టున్నారు వేణు ఊడుగుల. ‘చూడు సాగర్.. నేనేదో గ్రేట్ అని కాదుకానీ నీలాంటి వేస్ట్ ఫెలోస్ ని మార్చడంలో నాకేదో తృప్తి ఉంటుంది’ అని హీరోయిన్ చేత చెప్పించిన డైలాగ్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ మొత్తంలో దర్శకుడు వేణు ఊడుగుల రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. సందర్భానికి తగ్గట్టు సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా బలమైన సంభాషణలు అందించారాయన. అందులో మచ్చుకు కొన్ని.. విద్యా విహీన: పశువు అని పదిమందికి పాఠాలు చెప్పే టీచర్‌ను నేను.. అటువంటిది నా ఇంట్లో నుంచే ఒక పశువు బయటకు వస్తున్నాడంటే.. నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పరా.. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్క క్షణం మాకోసం ఆలోచించావా.., ఎప్పుడు చస్తామో తెలియని ఈ బొంగు లైఫ్ కోసం ఏంట్రా మీ సోదంతా.. నవ్వు రావడం.. కోపం రావడం.. బాధ కలగడం.. ఇవన్నీ బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ కదండీ..

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *