చెట్టుకు యావజ్జీవ శిక్ష

అది పాకిస్థాన్‌లోని లాండీ కోటల్‌ ఆర్మీ కంటోన్మెంట్‌ ప్రాంతం. లోపలికి వెళ్లి చూస్తే బలమైన ఇనుప కడ్డీలతో బంధించబడి.. ఎండకు ఎండి, వానకు తడిచి దశాబ్దాల క్రితం నుంచి శిక్ష అనుభవిస్తున్న ఓ దోషి కాని నిర్దోషి దర్శనమిస్తుంది. ఎప్పుడో 1898లో వేసిన శిక్షను ఇప్పటికీ అనుభవిస్తుంది. అదంతా తాను చెయ్యని నేరానికే. ఏ పాపం నేనెరుగను అని చెప్పలేని పరిస్థితి దానిది. కనీసం ఇతరుల సాయం కూడా తీసుకోలేదు. ఇదేదో ‘బాహుబలి’ సినిమాలోని దేవసేన అయితే కాదు సుమా. నా కొడుకొస్తాడు విడిపిస్తాడు అని ఎదురుచూస్తుందనుకోటానికి. ఎందుకంటే ఆ దశాబ్దాల కారాగారవాసి ఎవరో కాదు ఒక చెట్టు.

ఏ పాపం ఎరుగని ఈ చెట్టుకి శతాబ్దాల నుంచి శిక్షను అమలు చేస్తున్నారు. ఉక్కు సంకెళ్లలతో బంధించి ఇప్పటికీ శిక్షను అమలు చేస్తున్నారు. 1898లో పాకిస్థాన్‌లోని లాండీ ఆర్మీ కంటోన్మెంట్‌ ప్రాంతంలో జేమ్స్‌ క్విడ్‌ అనే బ్రిటీషు ఆర్మీ అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఓ రోజు రాత్రి మద్యం సేవించిన అధికారి మత్తులో చెట్టుపైన తూలిపడ్డాడు. అప్పటికే కిక్కులో ఉన్న ఆ అధికారి.. చెట్టే ఉద్దేశపూర్వకంగా తనపై అపాయం తలపెట్టిందని దానిపై చర్య తీసుకున్నాడు. అతని అధికారాన్ని ఉపయోగించి వెంటనే అక్కడున్న సిబ్బంది ద్వారా చెట్టుకి బలమైన ఇనుప సంకెళ్లతో బంధించాడు.

ఆ ఇనుప కడ్డీలు చెట్టుకు చుడుతూ, భూమి లోపలికి పాతిపెట్టాడు. చెట్టు కొమ్మల్లో ఒక బోర్డును వేలాడదీశాడు. దాని సారాంశం ఎలా ఉందంటే.. నేను ఖైదు చేయబడ్డాను. అధికారి క్విడ్‌ నన్ను అరెస్ట్‌ చేశాడు. అనే సందేశంతో ఉంటుంది. అది మళ్లీ ఎక్కడికైనా పారిపోతుందని క్విడ్‌ అలా చేశాడట. అప్పట్నుంచి నేటివరకు మర్రిచెట్టు అరెస్టై బందీగానే కాలం గడుపుతోంది. అయితే దానిని శిక్ష నుంచి తప్పించాలని స్థానికులు చాలానే ప్రయత్నించారు. కానీ ఏదీ ఫలించలేదు. చివరికి గట్టిగా పోరాడిన ఓ స్థానికుడు సైతం అలాంటి శిక్షకే గురయ్యాడు. 2008లో పాకిస్థాన్‌ ప్రధాని చెట్టుకు బెయిల్‌ ఇవ్వాలని దానిని విముక్తురాల్ని చేయాలని ఆజ్ఞలు జారీ చేశాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. 2011లోనూ ఇలాంటి ప్రయత్నాలు చాలా జరిగాయి.

కానీ ఏదీ ఆ చెట్టుని కారాగారం నుంచి తప్పించలేకపోయాయి. కారణం ఫ్రాంటీయర్‌ క్రైమ్స్‌ రెగ్యులేషన్‌ చట్టం ప్రకారం ఈ శిక్షను అమలు చేశారట. ఇది అప్పటి బ్రిటీషు చట్టం. వాయువ్య పాకిస్థాన్‌లో ఉండే గిరిజనులను శిక్షించడానికి ఈ చట్టాన్ని ఉపయోగించేవారట. ఇప్పటికీ ఆ ప్రాంతంలో చట్టం అమలులో ఉందట. అందుకే చెట్టును శిక్ష నుంచి విముక్తురాలిని చేయలేకపోతున్నారు.

మనుషులకు ఆరోగ్యకర జీవితాన్ని ప్రసాదించే చెట్లకే ఇంత కఠినమైన శిక్షను అమలు చేస్తే.. దోపిడీదారులు, దొంగలు, ఘరానా మోసాలు చేసేవారికి ఇంకెంత కఠినమైన శిక్షలు అమలుచేయాలి అని అందరూ అనుకుంటున్నారు

Videos

3 thoughts on “చెట్టుకు యావజ్జీవ శిక్ష

Leave a Reply

Your email address will not be published.