డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మాట మార్చారు. మొన్నటిదాకా ఏ నోటితోనైతే ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ను పొగిడారో.. అదేనోటితో మళ్లీ తిట్లపురాణం మొదలెట్టారు. ‘కిమ్‌.. అణుబాంబులు చేతపట్టుకున్న పిచ్చోడు..’ అని దూషించారు. ఈ మేరకు ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్తీతో ట్రంప్‌ జరిపిన ఫోన్‌ సభాషణను అమెరికన్‌ వార్తాపత్రికలు రట్టుచేయడం సంచలనంగా మారింది.

కొద్దిరోజుల కిందటే ‘కిమ్‌ను కలవడాన్ని గౌరవంగా భావిస్తా’నన్న ట్రంప్‌.. ఒక దశలో ఉత్తరకొయా నేతతో చర్చలు జరపబోతున్నట్లు చెప్పారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు కిమ్‌పై విమర్శలు గుప్పించారు. ఉత్తరకొరియా దగ్గరున్న అణ్వాయుధాలకంటే 20రెట్లు ఎక్కువ ఆయుధాలు తమ దగ్గరున్నాయని, కిమ్‌ను క్షణాల్లో అంతం చేయగల సత్తా ఉన్నా అమెరికా ఆ పని చేయబోదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘కిమ్‌ గురించి మీరేమనుకుంటున్నారు?’ అని ట్రంప్‌ ప్రశ్నించగా, ‘అతనికి మతిచెడింది. ఏక్షణంలోనైనా ప్రమాదకారిగా మారే అవకాశం ఉంది’ అని రొడ్రిగో బదులిచ్చినట్లు పత్రికలు పేర్కొన్నాయి.

కాగా, కిమ్‌ను కట్టడిచేసేలా చైనాపై ఒత్తిడి తేవాలని (ఫిలిప్పీన్స్‌)రొడ్రిగోను ట్రంప్‌ కోరడం గమనార్హం. ‘చైనా గనుక ఉత్తరకొరియాకు మద్దతు ఉపసంహరించుకుంటే, కిమ్‌ పని అయిపోయినట్లే. మీరు ఒకసారి చైనా ప్రెసిడెంట్‌ జిన్‌ పింగ్‌ తో మాట్లాడిచూడండి. మాట వింటే పని సులువైనట్లే. వినకపోతే మేమే(అమెరికానే) కిమ్‌ మెడలు వంచుతాం’ అని రొడ్రిగోతో ట్రంప్‌ అన్నట్లు పత్రికలు తెలిపాయి. అప్పటికీ వినకపోతే చిట్టచివరి ప్రయత్నంగా కొరియాపై అణుబాంబులు వేస్తాం. కానీ అది ఏ ఒక్కరికీ మంచిదికాదు’ అని ట్రంప్‌ ఫోన్‌ ఫోన్‌ సంభాషణను ముగించారట.

Videos

Leave a Reply

Your email address will not be published.