కమ్ముకున్నయుద్ధ మేఘాలు

ఉత్తర కొరియా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుష్టుడని, అమెరికాపై దాడి తప్పదని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా నేతలను తుడిచేస్తామంటూ ట్రంప్ కూడా నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో అమెరికాకు వ్యతిరేకంగా శనివారం భారీ ర్యాలీ జరిగింది. మరోవైపు కొరియా గగనతలంపై అమెరికా బాంబర్ విమానం చక్కర్లు కొట్టింది.

సియోల్/ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 24: ఉత్తరకొరియా, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వ్యక్తిగత విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉత్తరకొరియా గగనతలంలో అమెరికా బాంబర్, దానికి మద్దతుగా దక్షిణ కొరియా జెట్ ఫైటర్లు చక్కర్లు కొట్టడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ట్రంప్‌పై దాడి తప్పదని కొరియా హెచ్చరిస్తుండగా.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఆ దేశ విదేశాంగ మంత్రి రియాంగ్ ఇక చుట్టుపక్కల ఎక్కువకాలం ఉండలేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం మరింత వేడిని పెంచింది. గత వారాంతంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఆ దేశ విదేశాంగమంత్రి రి యాంగ్‌లను ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కొరియా రాజధాని ప్యాం గ్యాంగ్‌లోని కిమ్ ఇల్ సంగ్ స్కేర్ వద్ద అమెరికాకు వ్యతిరేకంగా శనివారం భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పదుల వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్న దృశ్యాలను ఆ దేశ టీవీ చానెల్ కేఆర్టీ ప్రసారం చేసింది. ప్రపంచం నుంచి అమెరికాను, దుష్ట అధ్యక్షుడిని తొలిగించేందుకు ఆ దేశంతో అంతిమ యుద్ధం చేసేందుకు మంచి సమయం కోసం వేచిచూస్తున్నాం. కిమ్ ఆదేశిస్తే ఆక్రమణదారులను అంతమొందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అని కొరియా రెడ్‌గార్డ్స్ కమాండింగ్ అధికారి రీ ఇల్ బే అన్నట్టు కేసీఎన్‌ఏ వార్తా సంస్థ తెలిపింది. కిమ్ జోంగ్ ఉన్‌ను రాకెట్ మ్యాన్ అని ట్రంప్ విమర్శించగా.. దీనికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో శనివారం రి యాంగ్ గట్టిగా బదులిచ్చారు. దుష్ట అధ్యక్షుడి (ట్రంప్) వ్యాఖ్యల తర్వాత.. దాడి అనివార్యమైందని, కొరియా క్షిపణులు అమెరికా భూభాగాలను తాకడం ఇక తప్పదనిపిస్తున్నదని పేర్కొన్నారు. మాటల యుద్ధంతో భారీ ప్రమాదమే పొంచి ఉన్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికాను చేరుకునే సామర్థ్యం కలిగిన అణ్వాయుధ క్షిపణి అభివృద్ధి లక్ష్యంగా ఉత్తరకొరియా ముందుకు వెళ్తుండగా.. దాన్ని ముందుగానే అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ట్రంప్, కిమ్ ఒకరినొకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ, బెదిరింపులకు కూడా వెనుకాడడంలేదు.

చక్కర్లు కొట్టిన యుద్ధ విమానాలు

మరోవైపు ఉత్తరకొరియా తూర్పు తీరంలోని అంతర్జాతీయ వైమానిక ప్రాంతంలో శనివారం అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-1బీ లాన్సర్ బాంబర్ విమానాలు చక్కర్లు కొట్టాయి. ఈ బలగాల ప్రదర్శన.. ట్రంప్ సైన్యం శక్తిసామర్థ్యాలను సూచిస్తున్నదని అమెరికా తెలిపింది. ఉత్తర, దక్షిణకొరియా విడిపోయాక ఇరుదేశాల సరిహద్దులో అమెరికా యుద్ధవిమానాలు ఆకాశంలో కనిపించడం 21వ శతాబ్దంలో ఇదే తొలిసారని పెంటగాన్ పేర్కొన్నది.

వారు ఎక్కువకాలం చుట్టుపక్కల ఉండలేరు అని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, ఆ దేశ విదేశాంగమంత్రి రియాంగ్‌ను హెచ్చరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం రాత్రి ట్వీట్ చేశారు. కిమ్ జోంగ్ ఉన్ ఆలోచనలకు అనుగుణంగా ఉత్తరకొరియా విదేశాంగమంత్రి ఐరాస లో బెదిరింపు ప్రసంగాలు చేశారన్నారు. ట్రంప్ మానసిక రోగి అని, అతని తీరు యుద్ధాలను పురిగొల్పేలా ఉన్నదని, తమ దేశాన్ని బెదిరించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని శనివారం రీ యాంగ్ ఐరాసలో విమర్శించిన నేపథ్యంలో.. ట్రంప్ పైవిధంగా ట్విట్టర్‌లో స్పందిస్తూ హెచ్చరికలు జారీచేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *