ఓలా, ఉబెర్‌ డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మె

 ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థలు ఓలా, ఉబెర్‌కుచెందిన డ్రైవర్లు  దేశవ్యాప్తంగా  సమ్మెకు దిగనున్నారు.  గత కొన్నినెలలుగా  భారీగా క్షీణించిన ఆదాయం, తమ యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మార్చి 19న దేశవ్యాప్తంగా  తమ సేవలను నిలిపివేయనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నతమ సమస్యలను  పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఓలా, ఉబెర్‌ డ్రైవర్లు ఈ పోరాటానికి సన్నద్ధమవుతున్నారు.  గతంలో అనేక సార్లు నిరసనలు,  సమ్మెలు  చేపట్టినా ఫలితం లేకపోవడంతో మరోసారి వీరు  సమ్మెబాట పట్టనున్నారు.

మార్చి 19 ఉదయం 8 గంటలకు సమ్మె ప్రారంభం కానుందని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ వాహతుక్ సేన  ప్రతినిధి  సంజయ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబాలతో కలిసి  డ్రైవర్లందరూ  ఓలా, ఉబెర్‌  కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలను చేపడతారని చెప్పారు. తమ డిమాండ్లను నేరవేర్చకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని..అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని  సంజయ్ నాయక్  హెచ్చరించారు. కాగా దీర్ఘకాల, కఠినమైన పని గంటలు, తక్కువ వేతనాలు, ఇన్‌సెంటివ్స్‌ తదితర అంశాలు క్యాబ్ డ్రైవర్లు తమ అసంతృప్తిని కొంతకాలంగా ప్రకటిస్తూనే ఉన్నారు.. క్యాబ్  సంస్థల ఆదాయం బాగా పుంజుకుంటున్నా  తమకు ఈ రేషియోలో ఆదాయం పెరగడం లేదని డ్రైవర్ల ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా 12 గంటలు పనిచేసినప్పటికీ…తమ ఆదాయం 20శాతం పడిపోయిందనీ, దీంతో   వాహనాలకోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేకపోవడంతో బ్యాంకులు వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నాయని వాపోతున్నారు. మరోవైపు ఈ సమ్మె సమయంలో క్యాబ్‌ ధరలు నింగిని తాకనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమ్మె  ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై,  కోలకతా, హైదరాబాద్‌ వంటి పెద్ద నగరాల్లో రోజువారీ వ్యాపారాన్ని  ప్రభావితం చేయనుంది.

ప్రధాన డిమాండ్లు:
ప్రారంభంలో డ్రైవర్లకు హామీ ఇచ్చినట్టుగా 1.25రూపాయల బిజినెస్‌
కంపెనీ సొంతమైన క్యాబ్‌ల రద్దు
బ్లాక్‌ లిస్టులో పెట్టిన డ్రైవర్ల సేవల పునరుద్దరణ
వాహనం ఆధారంగా చార్జీ నిర్ణయం
తక్కువ ధరల బుకింగ్‌ రద్దు

Videos

Leave a Reply

Your email address will not be published.