ఐరాసలో కాశ్మీర్ పై రహస్య చర్చలు

కాశ్మీర్‌పై శుక్రవారం ఐరాస భద్రతా మండలిలో రహస్య సంప్రదింపులు జరిగిన నేపథ్యంలో భారత్‌ మరోసారి తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజానికి గట్టిగా వినిపింది. ఇవి రహస్య చర్చలైనందున లోపల ఏ దేశం ఏం మాట్లాడిందనే విషయం బయటకు రాలేదు. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత, పది తాత్కాలిక (మొత్తం 15) సభ్య దేశాలే ఈ చర్చల్లో పాల్గొంటున్నాయి. భారత్, పాక్‌లకు భద్రతా మండలిలో ఎలాంటి సభ్యత్వమూ లేనందున ఈ రెండు దేశాలు ఆ రహస్య చర్చల్లో పాల్గొన లేదు. తమ ప్రతినిధికి కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్‌ అభ్యర్థించినా భద్రతా మండలి అందుకు ఒప్పుకోలేదు. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లతోపాటు తాత్కాలిక సభ్యదేశాలైన జర్మనీ, బెల్జియం, కువైట్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, పోలాండ్, పెరూ, డొమినికన్‌ రిపబ్లిక్, ఈక్వెటోరియల్‌ గినియా, కోట్‌ డీఐవరీలు రహస్య చర్చల్లో పాల్గొన్నాయి.

ఇప్పటికే చాలా దేశాలు కశ్మీర్‌ అంశం భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక అంశం అని స్పష్టం చేశాయి. చర్చల్లో పాల్గొనడానికి ముందు ఐరాసలో రష్యా ఉప శాశ్వత ప్రతినిధి దిమిత్రీ పోల్యాంస్కీ మాట్లాడుతూ కశ్మీర్‌ అంశం భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక అంశంగానే రష్యా చూస్తోందని అన్నారు. రహస్య చర్చలు ముగిసిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో చైనా రాయబారి ఝాంగ్‌ జున్‌ మాట్లాడుతూ భారత్, పాక్‌లు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు.

పాక్‌, చైనాల కోరిక మేరకు జరిగిన ఈ సమావేశానంతరం ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ మీడియాతో మాట్లాడారు. అధికరణ 370రద్దు విషయంలో భారత్‌ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి బయటి జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదానికి స్వస్తి పలికితేనే చర్చలకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలనే సద్భావనతోనే అధికరణ 370ని రద్దు చేశామని వివరించారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Videos

18 thoughts on “ఐరాసలో కాశ్మీర్ పై రహస్య చర్చలు

Leave a Reply

Your email address will not be published.