ఆవులను స్కూలులో వదిలిన రైతులు..భయంతో విధ్యార్థులు పరుగులు
ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లోని గోన్‌హత్ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం వీధుల్లో తిరిగే 200లకు పైగా ఆవులను స్థానిక ప్రభుత్వ పాఠశాలకు తీసుకొచ్చారు. ఈ ఆవులు తమ పంటలను నాశనం చేస్తుండటంతో వాటిని స్కూల్లోకి తోలి తాళం వేశారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఆవులు స్కూల్ ప్రాంగణంలోకి రావడంతో ఆందోళనకు గురైన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను గదుల్లోకి తీసుకెళ్లి తలుపులు వేసుకొన్నారు. సమాచారమందుకున్న స్థానిక విద్యాశాఖ అధికారి స్కూల్‌కు చేరుకుని రైతులతో మాట్లాడారు. అయితే రైతులు వాగ్వాదానికి దిగడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆవులను అక్కడి నుంచి పంపించారు. చిన్నారులను ప్రమాదంలో పడేసిన రైతులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.