దక్షిణ కోస్తాకు పెనుగాలులు, భారీ వాన ముప్పు

వర్దా’ అతి తీవ్ర తుపాను వణుకు పుట్టిస్తోంది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర, అటు ఉత్తర తమిళనాడులే లక్ష్యంగా పయనిస్తోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వర్దా ప్రతాపం మొదలయింది. సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. తీరం వైపునకు చొచ్చుకు వస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న ఈ అతి తీవ్ర తుపాను పశ్చిమ దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఆదివారం రాత్రికి ఇది తూర్పు ఈశాన్య దిశగా చెన్నైకి 300, నెల్లూరుకు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ క్రమేపీ తుపానుగా బలహీనపడుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల తీరాల మధ్య చెన్నైకి సమీపంలో సోమవారం మధ్యాహ్నానికి తీరాన్ని దాటనుంది.

ఆ సమయంలో గంటకు 100 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. దీని ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది.

తుపాను తీరం దాటే సమయంలో ఆ ప్రభావిత ప్రాంతాల్లో సముద్ర కెరటాలు సాధారణంకంటే మీటరుకు పైగా ఎత్తుకు ఎగసి పడతాయని, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మత్య్సకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు కృష్ణపట్నం పోర్టులో ఆరో నంబరు అతి ప్రమాద సూచికను, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవుల్లో 3వ నంబరు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.

తమిళనాడు సర్కారు అప్రమత్తం
వర్దా తుపాను చెన్నైకు సమీపంలోని తీరం దాటనుండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాన్‌ ప్రభావం చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల మీద అత్యధికంగా ఉండే అవకాశాలు కన్పిస్తుండడంతో సోమవారం విద్యా సంస్థలకు, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు. తీరప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏదేని ప్రళయం చోటుచేసుకుంటే, ప్రజల్ని రక్షించడం, ఆదుకునేందుకు తగ్గ సామగ్రి సిద్ధం చేశారు. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన తుపాను తీవ్రతకు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడండి
పెను తుపాను నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అధికారులతో సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయన జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడారు. విద్యుత్తు సరఫరాకు అంత రాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కళ్యాణి డ్యామ్, బాహుదా ప్రాజెక్టు లాంటి వాటికి గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు పర్యవేక్షణ కోసం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించింది. తుపాను సమాచారం కోసం విజయవాడ లోని కంట్రోల్‌రూమ్‌ నంబరు 2488000కు ఫోన్‌ చేయొచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఐదు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఐదు జిల్లాలకు పంపించారు. మరోవైపు తుపాన్, దానివల్ల కురిసే వర్షాలతో పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల రైతులు వణికిపోతున్నారు. ఆయా జిల్లాల్లో లక్షల ఎకరాల్లోని వరిపైరులో సగం వరకు కోతలు కోసి కుప్పలు వేసుకున్నారు. ఇప్పుడు భారీ వర్షాలకు పంట చేతికొచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

శ్రీహరికోటకు తప్పిన ముప్పు
వర్దా తుపాన్‌ దిశను మార్చుకోవడంతో ఇస్రో ఊపిరిపీల్చుకుంది. ఒక దశలో శ్రీహరికోట వద్ద తీరం దాటుతుందని వాతావరణశాఖ వారు హెచ్చరికలు జారీ చేయడంతో షార్‌ కేంద్రంలో అన్ని చర్యలు తీసుకున్నారు. 1984లో ఒకమారు శ్రీహరికోట వద్ద తీరం దాటడంతో ఈ ప్రాంతంతో పాటు శ్రీహరికోట కూడా అతలాకుతలమైంది. అప్పట్లో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో భారీ నష్టం జరిగింది.

ఉప్పాడ తీరంలో కడలి కల్లోలం
తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొత్తపల్లి మండల తీరప్రాంతం అతలాకుతలమవుతోంది. ఆదివారం సాయంత్రం ఉగ్రరూపం దాల్చిన సాగరం ఒక్కసారిగా ముందుకు చొచ్చుకు వచ్చింది. సుమారు 6 మీటర్ల ఎత్తున ఎగసిపడిన కెరటాలు ఉప్పాడ – కాకినాడ బీచ్‌రోడ్డును ఛిద్రం చేశాయి. దీంతో బీచ్‌రోడ్డు సుమారు మూడు కిలోమీటర్ల మేర కోతకు గురైంది. జియోట్యూబ్‌ టెక్నాలజీతో నిర్మించిన రక్షణ గోడ సైతం పూర్తిగా ధ్వంసమైంది.

Videos

20 thoughts on “దక్షిణ కోస్తాకు పెనుగాలులు, భారీ వాన ముప్పు

Leave a Reply

Your email address will not be published.