‘మెర్సల్‌’ వివాదంలో కొత్త మలుపు.. తీవ్రంగా ఖండించిన విశాల్‌

‘మెర్సల్‌’ చిత్ర వివాదం కొత్త మలుపు తిరిగింది. సినిమాలోని జీఎస్టీ, డిజిటల్‌ ఇండియా సంభాషణలపై రేగిన వివాదం ఇప్పుడు పైరసీ వైపు తిరిగింది. ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన బీజేపీ సీనియర్‌ నేతల్లో ఒకరైన హెచ్‌.రాజా ‘మెర్సల్‌’ చిత్రాన్ని పైరసీలో చూశానని చెప్పడంపై సినీ పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పైరసీ నుంచి సినీ పరిశ్రమని రక్షించమని తాము వేడుకుంటుంటే… అది నెరవేర్చాల్సిన రాజకీయ నేతలే పైరసీ ప్రోత్సహించడమేంటని మండిపడుతోంది. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్‌ ఆదివారం బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజాపై తీవ్రంగా మండిపడ్డారు.
‘ఒక నాయకుడిగా, దేశంలో ప్రముఖుడిగా ఉన్న మీరు పైరసీని ప్రోత్సహించడం కరెక్టేనా? పైరసీలో సినిమా చూశానని చెప్పడం సమంజసమేనా? మంచి పౌరుడు ఏదైనా తప్పు చేసేముందు రెండు మూడుసార్లు ఆలోచిస్తాడు. అలాంటిది ఒక రాజకీయ నేతగా మీరు పైరసీలో సినిమా చూడడం చాలా పెద్ద తప్పు’ అని విశాల్‌ విమర్శించారు. సినీ పరిశ్రమలోని ఇతర తారలు, నిర్మాతలు కూడా ఈ చర్యపై మండిపడుతున్న నేపథ్యంలో రాజా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ‘మెర్సల్‌’ని పైరసీలో చూడలేదని, ఫోన్‌లో వచ్చిన వీడియోలను మాత్రమే చూశానని రాజా చెప్పారు.
       అయినా తన ఫోన్‌కు వచ్చే వీడియోలను తానెందుకు చూడకూడదని ఎదురు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, కేంద్ర సెన్సార్‌ బోర్డు సభ్యులలో ఒకరైన సీనియర్‌ నటి గౌతమి ఈ వివాదంపై స్పందిస్తూ… ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్న సందేశాన్ని ప్రచారం చేసిన ‘మెర్సల్‌’ సినిమా తనకు బాగా నచ్చిందని, జీఎస్టీ, డిజిటల్‌ ఇండియా పథకాలపై ప్రయోగించిన సంభాషణలపై అభ్యంతరం తెలిపాల్సిన అవసరం తనకు కనిపించలేదని పేర్కొన్నారు.
Videos

Leave a Reply

Your email address will not be published.