351 లక్ష్యాన్ని ఛేదించిన భారత్

అద్భుత విజయం దరిచేరింది. అటు టెస్ట్‌లు, టీ20ల మోజులో పడి రోజురోజుకు ప్రభావం కోల్పోతున్నా..వన్డేలకు ఈ మ్యాచ్ ప్రాణం పోసింది. వన్డే క్రికెట్‌లో ఉన్న మజాను మరోసారి అభిమానులకు అందిస్తూ ఇంగ్లండ్‌పై భారత్ జయభేరి మోగించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన మొదటి వన్డేలో టీమ్‌ఇండియా 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 351 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ మరో 11 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. కెప్టెన్ కోహ్లీ(105 బంతుల్లో 122; 8ఫోర్లు, 5 సిక్స్‌లు), కేదార్ జాదవ్(76 బంతుల్లో 120; 12 ఫోర్లు, 4సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. బాల్(3/67) మూడు వికెట్లతో ఆకట్టుకోగా, విల్లే(2/47), స్టోక్స్(2/73) రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు రూట్(78), రాయ్(73), స్టోక్స్(62) అర్ధసెంచరీలతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 350/7 స్కోరు నమోదు చేసింది. హార్దిక్ పాండ్యా(2/46), బుమ్రా(2/79) రెండు వికెట్లు తీశారు. సెంచరీతో జట్టు విజయంలో కీలకమైన జాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈనెల 19న కటక్‌లో జరుగుతుంది.

కోహ్లీ..జాదూ కియా!

351.. ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యమిది. ఓవైపు కొండంత లక్ష్యం కనబడుతున్నా..కోహ్లీసేన ఏమాత్రం తొణకలేదు, బెణకలేదు. భారీ లక్ష్యఛేదనలో ఆదిలో తడబడ్డా..ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ, జాదవ్ సెంచరీలకు తోడు ఆఖర్లో హార్దిక్ పాండ్యా(37 బంతుల్లో 40 నాటౌట్, 3ఫోర్లు,సిక్స్) ఆల్‌రౌండ్‌షోతో విజయాన్ని ముద్దాడింది. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకొచ్చిన ధవన్(8)నిరాశపర్చగా, లోకేశ్ రాహుల్(1), యువరాజ్‌సింగ్(15), ధోనీ(6) అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయారు. దీంతో 63 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది.

రాయ్, రూట్, స్టోక్స్ విజృంభణ:

టాస్ గెలిచిన టీమ్‌ఇండియా కెప్టెన్ కోహ్లీ..ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టెస్ట్ సిరీస్ ఓటమికి ప్రతీకారం అన్న తరహాలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆది నుంచే భారత్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఓపెనర్ జాసన్ రాయ్(73)తో పాటు జో రూట్(78) ఆఖర్లో స్టోక్స్(40 బంతుల్లో 62, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 350 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 39 పరుగులకే హేల్స్(9) రనౌట్ రూపంలో వెనుదిరిగినా..రాయ్, రూట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అద్భుత ఫామ్‌కు కొనసాగింపు అన్నట్లు రూట్ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రాయ్ జతగా రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అయితే అశ్విన్ ఓవర్లో రాయ్ ఇచ్చిన క్యాచ్‌ను ఉమేశ్ యాదవ్ జారవిడిచాడు. జడేజా వేసిన తర్వాతి ఓవర్లోనే రాయ్..ధోనీ మెరుపు స్టంపింగ్‌తో ఔటవ్వడంతో కోహ్లీసేన ఊపిరిపీల్చుకుంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 27వ ఓవర్లో మోర్గాన్..కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బట్లర్(31)తో కలిసి రూట్ రన్‌రేట్ ఎక్కడా తగ్గకుండా స్కోరుబోర్డును పరిగెత్తించాడు. బట్లర్ నిష్క్రమణ తర్వాత స్టోక్స్ వచ్చి రావడంతోనే భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 115 పరుగులు స్కోరుబోర్డుకు జతకలిశాయి. తన ఇన్నింగ్స్‌లో 2ఫోర్లు, 5 సిక్స్‌లతో 33 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. మొయిన్ అలీ(28)తో జతగా ఆరో వికెట్‌కు 5.3 ఓవర్లలోనే 73 పరుగులు జోడించడంతో స్కోరు 350లకు చేరుకుంది.

ఇంగ్లండ్: రాయ్(స్టంప్/ధోనీ)(బి) జడేజా 73, హేల్స్ రనౌట్(బుమ్రా) 9, రూట్(సి)హార్దిక్ (బి)బుమ్రా 78, మోర్గాన్ (సి)ధోనీ(బి)హార్దిక్ 28, బట్లర్(సి)ధవన్(బి)హార్దిక్ 31, స్టోక్స్ (సి)ఉమేశ్ (బి) బుమ్రా 62, అలీ(బి)ఉమేశ్ 28, వోక్స్ (9 నాటౌట్), విల్లే (10 నాటౌట్); ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 50 ఓవర్లలో 350/7;
వికెట్ల పతనం: 1-39, 2-108, 3-157, 4-220, 5-244, 6-317, 7-336;
బౌలింగ్: ఉమేశ్ 7-0-63-1, హార్దిక్ 9-0-46-2, బుమ్రా 10-0-79-2, జడేజా 10-0- 50-1, అశ్విన్ 8-0-63-0, జాదవ్ 4-0-23-0,
యువరాజ్ 2-0-14-0.

భారత్: రాహుల్ (బి) విల్లే 18, ధవన్(సి) అలీ(బి) విల్లే 1, కోహ్లీ(సి)విల్లే(బి) స్టోక్స్ 122, యువరాజ్(సి)బట్లర్(బి)స్టోక్స్ 15, ధోనీ (సి) విల్లే(బి) బాల్ 6, జాదవ్ (సి) స్టోక్స్(బి)బాల్ 120, హార్దిక్ పాండ్యా 40 నాటౌట్, జడేజా(సి) రషీద్(బి) బాల్ 13, అశ్విన్ 15 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 48.1 ఓవర్లలో 356/7;
వికెట్ల పతనం:1-13, 2-24, 3-56, 4-63, 5-263, 6-291, 7-318;
బౌలింగ్: వోక్స్ 8-0-44-0, విల్లే 6-0-47-2, బాల్ 10-0-67-3, స్టోక్స్ 10-0-73-2, రషీద్ 5-0-50-0, అలీ 6.1-0-48-0, రూట్ 3-0-22-0.

3: వన్డేల్లో 350 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కిది మూడోసారి. మరోవైపు
టీమ్‌ఇండియాపై ఇంగ్లండ్‌కు ఇదే అత్యధిక స్కోరు(350/7).

5: వన్డేల్లో వేగవంతమైన సెంచరీ చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా కేదార్ నిలిచాడు. 65 బంతుల్లోనే ఈ సెంచరీ మార్క్ అందుకున్నాడు.

1:గత 14 వన్డే ఇన్నింగ్స్‌లో కోహ్లీ 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది పదోసారి.

1:వన్డే లక్ష్యఛేదనల్లో కోహ్లీ చేసిన సెంచరీలు ఇవి. ఈ రికార్డులో సచిన్‌తో కలిసి కోహ్లీ సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

2: కోహ్లీకిది వన్డేల్లో 27వ సెంచరీ.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *