బ్రాడ్‌మ‌న్ స‌ర‌స‌న విరాట్ కోహ్లి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చ‌రిత్ర సృష్టించాడు. ముంబై టెస్ట్‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన విరాట్.. మూడు డ‌బుల్ సెంచ‌రీలు చేసిన టీమిండియా కెప్టెన్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మూడు డ‌బుల్‌ సెంచ‌రీలూ ఈ ఏడాదిలోనే చేయ‌డం మ‌రో విశేషం. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో బ్యాట్స్ మన్ కోహ్లి. అతని కంటే ముందు డాన్ బ్రాడ్ మన్, రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్, బ్రెండన్ మెకల్లమ్ మాత్రమే ఒక కేలండర్ ఇయర్ లో మూడు డబుల్ సెంచరీలు చేశారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ క్రికెట్‌లో త‌న‌ను మించిన బ్యాట్స్‌మ‌న్ మ‌రొక‌రు లేర‌ని ఈ తాజా ఇన్నింగ్స్‌తో విరాట్ మ‌రోసారి నిరూపించాడు. ఈ ఏడాది మొద‌ట్లో వెస్టిండీస్‌తో తొలి డ‌బుల్ సెంచ‌రీ చేసిన విరాట్‌.. త‌ర్వాత న్యూజిలాండ్‌తో, ఇప్పుడు ఇంగ్లండ్‌తో మ‌రో రెండు డ‌బుల్ సెంచ‌రీలు త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై ఉన్న చెత్త రికార్డును కూడా తుడిచిపెట్టేశాడు కోహ్లి. సిరీస్ మొద‌ల‌య్యే ముందు ఇంగ్లండ్‌పై అత‌ని స‌గ‌టు 13.40 మాత్ర‌మే.

ఇక శ‌నివారం టెస్టుల్లో 50 స‌గ‌టును దాటిన విరాట్‌.. ఆదివారం టెస్టుల్లో 4000 ప‌రుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఈ ఏడాదిలోనే అత‌ను వెయ్యి ప‌రుగులు చేయ‌డం విశేషం. టీమిండియా కెప్టెన్లుగా టైగ‌ర్ ప‌టౌడీ, సునీల్ గ‌వాస్క‌ర్‌, స‌చిన్ టెండూల్క‌ర్‌, ఎంఎస్ ధోనీ ఒక్కో డ‌బుల్ సెంచ‌రీ చేశారు. కానీ కోహ్లి మాత్రం ఇప్ప‌టికే మూడు డబుల్స్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు టెస్టుల్లో ఇంగ్లండ్‌పై త‌న బెస్ట్ స్కోరును కూడా అందుకున్నాడు. ఇంత‌కుముందు ఉన్న 211 ప‌రుగుల బెస్ట్ స్కోరును ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అధిగ‌మించాడు. చివరికి 235 పరుగులు చేసి ఔటయ్యాడు. 340 బంతుల్లో 25 ఫోర్లు, ఒక సిక్సర్ తో విరాట్ 235 రన్స్ చేశాడు.

Videos

Leave a Reply

Your email address will not be published.