కెప్టెన్, కోచ్ మధ్య విభేదాలు!

భారత క్రికెట్‌లో అనిశ్చిత పరిస్థితి నెలకొన్నదా? జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులతో ఇప్పటికే బోర్డులో ఒక రకమైన అయోమయ పాలన కొనసాగుతుంటే.. తాజాగా జాతీయజట్టులో కూడా లుకలుకలు మొదలైనట్లు సమాచారం. ఇన్ని రోజులుగా పైకి కనబడని విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మినీ ప్రపంచకప్‌గా భావించే చాంపియన్స్ ట్రోఫీలో దాయాది పాక్‌తో మ్యాచ్ సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వార్తలు వెలువడటం జట్టు సభ్యుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసే అవకాశంగా కనిపిస్తున్నది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఎప్పుడు దూకుడు మీదుండే కెప్టెన్ కోహ్లీకి, పని పట్ల నిబద్ధతతో వ్యవహరించే కోచ్ అనిల్ కుంబ్లే మధ్య విభేదాలు పొడచూపాయి. కెప్టెన్‌తో పాటు జట్టులోని సీనియర్లు జంబో వ్యవహరిస్తున్న తీరును సహించలేకపోతున్నట్లు తెలుస్తున్నది.

వీరి మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలను తొలిగించేందుకు బీసీసీఐ సలహా కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ప్రయత్నం చేసే అవకాశముంది. కోచ్‌గా కుంబ్లే పనిపట్ల సలహా కమిటీ పూర్తి నమ్మకంతో ఉంది. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జట్టుకు వరుస విజయాలు అందిస్తున్న కోచ్‌తో ఆకస్మాత్తుగా చిచ్చురేగడమనేది ఆసక్తి కల్గిస్తున్నది. గత కోచ్‌లతో పోల్చుకుంటే విదేశీ కోచ్‌ల వలే ప్రొఫెషనలిజంతో వ్యవహరించే కుంబ్లే పనితీరు సీనియర్లకు ఏ మాత్రం నచ్చడం లేదు. అయితే ప్రస్తుతానికి జట్టులో అంతపెద్ద సంక్షోభానికి అవకాశం కనిపించడం లేదని అంచనా. మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి తరహా శైలి పట్ల ఆటగాళ్లు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం కోచ్‌కు ఆటగాళ్లకు మధ్య నెలకొన్న విభేదాలను తొలిగించేందుకు బోర్డు పరిపాలక కమిటీ (సీవోఏ) చీఫ్ వినోద్‌రాయ్.. సలహా కమిటీ సభ్యులతో త్వరలో చర్చించనున్నట్లు తెలుస్తున్నది.

దాదాతో కోహ్లీ మంతనాలు
కుంబ్లేతో ఏర్పడ్డ అభిప్రాయభేదాలపై సలహా కమిటీ సభ్యుడు గంగూలీతో కోహ్లీ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. న్యూజిలాండ్‌తో వామప్ మ్యాచ్ ముగిసిన తర్వాత దాదాతో కలిసి జట్టులో జరుగుతున్న విషయాలు మాట్లాడాడట విరాట్. ఇదిలా ఉంటే కుంబ్లే కాంట్రాక్టును పొడిగించేందుకు బోర్డులోని ఓ వర్గం మొగ్గుచూపిందట, కానీ జంబోతో కలిసి ఎక్కువ కాలం పనిచేయడం కోహ్లీకి ఇష్టం లేదని తెలుసుకున్న తర్వాత వెనుకకు తగ్గినట్లు తెలిసింది. దీనికి తోడు సీవోఏ సభ్యులతో కలిసి సన్నిహితంగా మెలుగడం బోర్డులోని సభ్యులకు అసలు నచ్చడం లేదు. వాస్తవానికి చాంపియన్స్ ట్రోఫీతో కుంబ్లే ఒప్పందం ముగిసిపోతుంది. అయితే ఆటగాళ్ల కాంట్రాక్టు విషయంలో అనిల్ అవలంబిస్తున్న వైఖరిపై ఆగ్రహంతో ఉన్న బోర్డు.. ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఇష్టపడటం లేదు. చీఫ్ కోచ్ పదవి కోసం ఇప్పటికే బోర్డు దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీని కోసం మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌ను దరఖాస్తు చేసుకోమని బోర్డులోని కొంత మంది కోరినా అతను నిరాకరించినట్లు తెలిసింది. మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి కూడా కోచ్ పదవిపై విముఖత వ్యక్తం చేశాడట. ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీ కోచ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావచ్చొని అనుకుంటుడగా, బోర్డులోని కొంత మంది మాత్రం ద్రవిడ్ వైపు మొగ్గుచూపుతున్నట్లు వినికిడి. ఏదైనా చాంపియన్స్ ట్రోఫీ తర్వాతే కోచ్ ఎవరన్నది తేలనుంది.

ఎక్కడ చెడింది..
అసలు కుంబ్లేతో ఎక్కడ చెడిందన్న దానిపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తున్నది. అయితే ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ సందర్భంగా ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్లు తెలుస్తున్నది. ఆఖరిదైన ధర్మశాల టెస్ట్‌లో గాయపడ్డ కెప్టెన్ కోహ్లీ స్థానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవడం రచ్చకు కారణమైంది. తుదిజట్టుకు కుల్దీప్‌ను ఎంపిక చేయడం తెలియని కోహ్లీ.. కుంబ్లే అనూహ్య నిర్ణయంతో ఆశ్చర్యపోయాడట. మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా కొనసాగటం కోహ్లీకి మరింత బలం చేకూర్చినైట్లెంది. ఒకానొక దశలో అసలు రవిశాస్త్రినే కొనసాగిస్తే బాగుంటుందని విరాట్ చేసిన అభ్యర్థనను బోర్డు పరిగణనలోకి తీసుకోలేదట. కోచ్‌గా కుంబ్లే చేరికతో జట్టులో ఫీల్ గుడ్ మిస్సందని పలువురు సీనియర్లు అభిప్రాయం వెలిబుచ్చారట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *