చంద్ర‌బాబు సైతం భ‌రించ‌లేని భ‌జ‌న‌..!

భ‌జ‌న లేకుండా రాజ‌కీయాలు ఉండ‌వు! ఈ విష‌యంలో కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు టాప్ పొజిష‌న్ లో ఉంటారు! ప్ర‌ధాని మోడీకి ఆయ‌న ఏ రేంజిలో భ‌జ‌న చేస్తారో మ‌నం చూస్తున్నదే. ర‌క‌ర‌కాల స్తుతీ కీర్త‌న‌ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్తద‌నం ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటారు! ఇక‌, ఏపీ భాజ‌పా నాయ‌కులు కూడా వెంక‌య్య‌ను త‌ల‌ద‌న్నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు! అయితే, వెంక‌య్య నాయుడు భ‌య‌ప‌డాల్సిన ప‌నేం లేదులెండి. ఎందుకంటే, వీరు భ‌జ‌న చేస్తున్నది ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకి. ఏపీలో ఉన్న భాజ‌పా మంత్రి కామినేని శ్రీ‌నివాస‌రావు ఇప్ప‌టికే పూర్తిస్థాయి టీడీపీ కార్య‌క‌ర్త‌గా రూపాంత‌రం చెంది చాలారోజులైంది. మంత్రి మాణిక్యాల‌రావు ఉన్నా… ఆయ‌న‌కు నోరే లేదు! ఇక‌, మిగిలింది పెన్మ‌త్స విష్ణుకుమార్ రాజు..! శాస‌న స‌భ‌లో ఆయ‌న‌కు కాసేపు మైక్ దొరికింది.

ఇక అంతే… స్వామిభ‌క్తి ప‌రాణ‌య‌త్వ ప్ర‌ద‌ర్శ‌న‌లో ఆసేతు హిమాల‌యాలను దాటేశారు..! ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు కాక‌పోయి ఉంటే రాష్ట్రం ప‌రిస్థితి ఏమై ఉండేద‌ని ఆవేద‌న చెందారు విష్ణు కుమార్ రాజు! ఆయ‌న్ని ఎన్నుకున్నందుకు ఆంధ్రా ప్ర‌జ‌ల‌కి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి కాక‌పోయి ఉంటే, రాష్ట్రం ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉండేదో ఊహించుకుంటేనే భ‌య‌మేస్తోంద‌న్నారు! ఆ ఊహ‌కి నిద్ర కూడా ప‌ట్ట‌దు అధ్య‌క్షా అన్నారు. ఈ ప‌రిస్థితుల్లో భ‌గ‌వంతుడు పంపిన మ‌హానుభావుడిలా చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యారు అధ్య‌క్షా అని చెప్పారు. ‘రాజ్యాధినేత‌లే చంద్ర‌బాబు అభిమానులు కావడం గుర్తించాలి అధ్యక్షా. బిల్ క్లింటన్ వచ్చారు, బిల్ గేట్స్ వచ్చారు. అలాగే, సీఎంగారికి మ‌రో మ‌న‌వి అధ్య‌క్షా.. ఆయ‌న రోజుకి 18 గంట‌లు ప‌నిచేస్తున్నారు. క‌నీసం ఆదివార‌మైనా ఆయ‌న విశ్రాంతి తీసుకోవాల‌ని కోరుతున్నాను అధ్య‌క్షా’ అని విష్ణుకుమార్ రాజు స‌భ‌లో స్తుతించారు! పొగ‌డ్త‌లు ఒక రేంజి వ‌ర‌కూ ఉంటే ఎంజాయిబుల్ గా ఉంటాయి.

మ‌రీ ఈ రేంజిలో అంటే.. చంద్ర‌బాబు కూడా త‌ట్టుకోలేక‌పోయారు! విష్ణు రాజు మాట్లాడుతున్నంత సేపూ ఎలాంటి ఎక్స్ ప్రెష‌న్ ఇవ్వాలో తెలియ‌ని ఒక అవ‌స్థ‌కు చంద్ర‌బాబు లోన‌య్యారు. ఎలా స్పందించాలో అర్థం కాక‌… కాసేపు న‌వ్వేసుకున్నారు కూడా! మొత్తానికి, స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌లో ఇదో విశ్వ‌రూప సంద‌ర్శ‌న యోగం! తెలుగుదేశం నాయ‌కులు కూడా ముక్కున వేలేసుకోవాల్సిన ప‌రిస్థితి. అరే.. తాము కూడా చంద్ర‌బాబును ఈ రేంజిలో మోసెయ్య‌లేక‌పోయామే, ఒక భాజ‌పా ఎమ్మెల్యే ఆ ప‌నిచేసేశారే అని ఆశ్చ‌ర్యపోవాల్సిన ప‌రిస్థితిని క్రియేట్ చేశారు. మొత్తానికి, భాజ‌పా ఎమ్మెల్యే నుంచి చంద్ర‌బాబు భ‌క్తుడిగా అవ‌త‌రించిన రూపాంత‌ర క్ర‌మాన్ని విష్ణురాజు అద్భుతంగా ఆవిష్క‌రించారు! కొత్త‌త‌రం రాజ‌కీయ నాయ‌కులు ఈయ‌న్ని చూసి నేర్చుకోవాలి మ‌రీ..! పొగిడితే ఈ రేంజిలో పొగ‌డాలి.. ఏమంటారు..?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *