సీబీఐకి షాక్: జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కొట్టేసిన సుప్రీం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సీబీఐ కోర్టు కొట్టేసింది. దీంతో జగన్ కుటుంబసభ్యులతోపాటు, వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. అయితే కోర్టు తీర్పుపై సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తోంది. జగన్ మీడియాలో ప్రసారమైన మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూనే మరోసారి ప్రస్తావించాలనే యోచనలో సీబీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

సాక్షి ఛానల్‌లో మాజీ సీఎస్ రమాకాంత్ ఇంటర్వ్యూ సాక్షులను ప్రభావితం చేసేలా ఉందంటూ వాదించిన సీబీఐ.. జగన్ బెయిలును రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అయితే, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతోనే సీబీఐ ఈ పిటిషన్ వేసిందని జగన్ తరపు న్యాయవాదులు వాదించారు. రమాకాంత్ ఇంటర్వ్యూతో జగన్‌కు సంబంధం లేదని, ఆయనతో జగన్ మాట్లాడలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అరగంటపాటు సీబీఐ, జగన్ తరపు న్యాయవాదుల వాదనలను విన్న కోర్టు.. సీబీఐ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో సీబీఐకి కోర్టులో చుక్కెదురైనట్లయింది. అయితే, కేసులో సాక్షిగా ఉన్న రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూలో కేసు విషయమై ఎలా మాట్లాడతారంటూ కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

మే 15 నుంచి జూన్ 15లోగా ఏవైనా 17రోజులపాటు విదేశీ పర్యటనకు వెళ్లవచ్చునని జగన్మోహన్ రెడ్డికి కోర్టు సూచించింది. అయితే, కుటుంబసభ్యులతో మాత్రమే పర్యటనకు వెళ్లాలని స్పష్టం చేసింది. తన న్యూజిలాండ్ పర్యటనకు అనుమతించాలంటూ జగన్ ఇంతకుముందు కోర్టుకు విన్నవించిన విషయం తెలిసిందే.

Videos

89 thoughts on “సీబీఐకి షాక్: జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కొట్టేసిన సుప్రీం

Leave a Reply

Your email address will not be published.