గాలి కూతురి పెళ్లికి వైఎస్ జగన్ ఎందుకు వెళ్లలేదు?

గాలి జనార్ధనరెడ్డి కూతురి పెళ్లి బెంగళూరులోని ప్యాలెస్‌లో నవంబర్ 16న అంగరంగ వైభవంగా, అనేక మంది అతిథుల సమక్షంలో ఘనంగా జరిగింది. పెళ్లిలో అడుగడుగునా గాలి జనార్ధనరెడ్డి ధనబలమే కనిపించింది. ఎంతోమంది ప్రముఖులకు ఖరీదైన వెడ్డింగ్ కార్డును ఇచ్చి మరీ గాలి, తన కూతురి పెళ్లికి రావాలంటూ ఆహ్వానించారు. ఏపీకి చెందిన సినీరాజకీయ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. కానీ ఒకరిద్దరు మినహా ఎవరూ ఈ భారీ వేడుకకు హాజరుకాలేదు. అలా హాజరుకాని వారిలో ఏపీకి చెందిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. గాలి కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన జగన్, పెళ్లికెందుకు వెళ్లలేదనే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
జగన్ పెళ్లికి వెళ్లకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మణి పెళ్లికి జగన్ వెళ్లాలనే భావించారట. కుదరకపోతే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వెళ్లాలని నిశ్చయించుకున్నారట. కానీ, ఇంతలోనే అధికార బీజేపీ చేసిన ప్రకటన జగన్‌ను సందిగ్ధంలో పడేసిందట. బీజేపీ నేతలెవరూ గాలి కూతురి పెళ్లికి వెళ్లలేదని అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లాంటి ఒకరిద్దరినీ మినహాయిస్తే చాలామంది నేతలు పెళ్లికి వెళ్లలేదు. అధికార పార్టీనే గాలిని దూరంగా పెట్టాలని భావించిన తరుణంలో తాను వెళ్లడం సమంజసం కాదని జగన్ భావించారట.
జైలు జీవితం గడిపొచ్చిన గాలి జనార్ధనరెడ్డి ఇంట్లో పెళ్లికెళితే అధికార పక్షం విరుచుకుపడే అవకాశముంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని జగన్ బ్రహ్మణి పెళ్లికి వెళ్లలేదట. ఇలా గాలి ఆహ్వానించినా పెళ్లికి వెళ్లని నేతలు చాలామందే ఉన్నారు. అందులో కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, సదానంద గౌడ, మాజీ ఉప ముఖ్యమంత్రి కెఎస్ ఈశ్వరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య, దేవగౌడ, హెచ్‌డి కుమారస్వామి తదితరులు ఉన్నారు. పెళ్లికి వెళ్లిన వారిలో కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఎంఎల్‌సి అమర్‌నాథ్ పాటిల్, అనంతపురం ఎంపీ వెంకట్రామి రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే పెళ్లికి హాజరుకాని వారంతా రిసెప్షన్‌కు వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Videos

Leave a Reply

Your email address will not be published.