లోకేష్‌ను ఓ ఆటాడేసుకున్న జగన్‌

ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులూ, అధికారులూ అందరూ కుమ్మక్కై విశాఖ భూములను దోచుకున్నారని వైసీపీ అధనేత జగన్ విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో సేవ్ విశాఖ పేరిట జరుగుతున్న మహాధర్నాలో జగన్ పాల్గొన్నారు. విశాఖలో జరుగుతున్న భూకుంభకోణం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. సాక్షాత్తూ మంత్రి గంటా శ్రీనివాసరావు, లోకేష్ లు కలిసి భూదందాలకు పాల్పడుతున్నారన్నారు. అమాయకుల భూములతోపాటు, ప్రభుత్వ భూములను కూడా కబ్జాకు చేస్తున్నారన్నారు. కలెక్టర్ సయితం ఆశ్చర్యపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. హుద్ హుద్ తుఫానులో రెవెన్యూ రికార్డులన్నీ గల్లంతయ్యాయని కలెక్టర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హుద్ హుద్ తుఫాను సమయంలో గాలి తప్ప కార్యాలయాల్లోకి నీరు చేరని విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మంత్రి గంటా, అయ్యన్నపాత్రుడుల మధ్య వివాదాలు భూకుంభకోణం వల్లనే బయటపడ్డాయన్న విషయం అందరూ గుర్తించాలని జగన్ కోరారు. విశాఖ భూకుంభకోణంలో లోకేష్ పాత్ర ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే.

గీతం కాలేజీ యాజమాన్యానికి చంద్రబాబు వేల కోట్ల రూపాయల విలువైన భూములను అప్పనంగా కట్టబెడుతున్నారన్నారు. విశాఖలోని గీతం కాలేజీ నిర్వాహకుడు మూర్తి చంద్రబాబుకు దగ్గర బంధువని, అందుకోసమే ఆయనకు చెందిన కళాశాలకు 36 ఎకరాలను కట్టబెట్టేందుకు మంత్రివర్గంలో చంద్రబాబు ఆమోదం చేయించారన్నారు. భీమిలిలో 300 ఎకరాలు మంత్రి గంటా శ్రీనివాసరావు తన బినామీల పేరిట కబ్జా చేసుకున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూముల కబ్జాకు చంద్రబాబు పాల్పడుతున్నారన్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ ను మూసివేసి భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని చంద్రబాబు చెపుతున్నారని, టీడీపీకి చెందిన నేతలు అక్కడ భూములు కొన్నారని జగన్ ఆరోపించారు. భోగాపురం ఏరియాలో టీడీపీ నేతలు కొన్న భూములు మాత్రం తీసుకోరని, అమాయక ప్రజల భూములను మాత్రం ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ కు తీసుకుంటుందని చెప్పారు. నీకింత…లోకేష్ కింత అన్నది ఏపీలో జరుగుతుందన్నారు. సిట్ పేరుతో మరో మోసానికి చంద్రబాబు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. సిట్ లో ఉన్న అధికారులంతా చంద్రబాబు వద్ద పనిచేసే వారేనని, ఇందులో నిజాలు ఎలా బయటపడతాయని జగన్ ప్రశ్నించారు. విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని జగన్ డిమాండ్ చేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *