రాత్రికి రాత్రే..! బెజవాడలో వైఎస్ భారీ విగ్రహాం కూల్చివేత

కృష్ణ పుష్కరాల అభివృద్ది పనుల నిమిత్తం 40 హిందూ దేవాలయాలను కూల్చివేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా విగ్రహాలపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అర్థరాత్రి కంట్రోల్ రూమ్ కు దగ్గరలో ఉన్న దివంగత సీఎం వైఎస్ విగ్రహాన్ని అధికారులు తొలగించి వేశారు. అప్పట్లో వైఎస్ చేపట్టిన జలయజ్ఞానికి ప్రశంసపూర్వకంగా 2009లో బెజవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పోలవరం డిజైన్ పై ఏర్పాటు చేసిన ఈ భారీ వైఎస్ విగ్రహాన్ని రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు తొలగించేశారు. భారీ ప్రొక్లెయినర్స, క్రెయిన్ల సహాయంతో విగ్రహాన్ని కూల్చివేశారు.

విగ్రహా కూల్చివేత విషయం వైసీపీ కార్యకర్తలకు తెలియడంతో.. పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగవీటి రాధా, జోగి రమేష్ సహా పలువురు కార్యకర్తలు కూల్చివేతను అడ్డుకోవడానికి వెళ్లారు. అయితే కార్యకర్తలను వారించిన పోలీసులు అందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే విగ్రహాన్ని కూల్చివేయడంపై వైసీపీ నేతలు భగ్గమంటున్నారు.

అటు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన లగడపాటికి కూడా ప్రభుత్వం ఎలాంటి నోటీసులు పంపించలేదని ఆయన కార్యాలయ సిబ్బంది వెల్లడించినట్లు సమాచారం. వైఎస్ ప్రతిష్టను చూసి ఓర్వలేకే సీఎం చంద్రబాబు ఇలా రాత్రికే రాత్రి విగ్రహాన్ని కూల్చి వేయించారని విమర్శించారు వైసీపీ నేతలు. రోడ్డుకు అడ్డుగా ఉన్న విగ్రహాలను తొలగించకుండా వైఎస్ విగ్రహాన్నే ఎందుకు కూల్చివేశారని, ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *