నారాయణరెడ్డి హత్యపై అనేక అనుమానాలు…

కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇన్‌చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణహత్య వెనుక దిగ్బ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కాప్లాన్‌తోనే నారాయణరెడ్డిని హత్య చేసినట్టు తెలుస్తోంది. పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీని నారాయణరెడ్డి బలోపేతం చేసిన తీరును చూసి ఓర్వలేకే కొందరు పెద్దలు ఈ హత్య చేయించినట్టు భావిస్తున్నారు. నారాయణరెడ్డిని వ్యూహాత్మకంగా చావుకు దగ్గర చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫ్యాక్షన్ ప్రాంతంలో ఉన్న నారాయణరెడ్డికి ప్రాణహానీ ఉందన్న విషయం అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఆయనకు లైసెన్స్‌డ్ రివాల్వర్ కూడా ఇచ్చింది. అయితే రెన్యువల్ కోసం వెపన్‌ను నారాయణరెడ్డి పోలీసులకు అప్పగించారు. త్వరగా రెన్యువల్ చేసి తుపాకీ తిరిగి ఇవ్వాలని కోరినా జిల్లా పోలీసులు పట్టించుకోలేదు. పైగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రాణహాని ఉందని.. కాబట్టి గన్‌మెన్‌ను కేటాయించాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకున్నారు.

కనీసం పెయిడ్‌ గన్‌మెన్‌ నియామకానికైనా అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. నారాయణరెడ్డి వద్ద తుపాకీ కూడా లేదని తెలుసుకున్న ప్రత్యర్థులు హత్యకు పథక రచన చేశారు. నారాయణరెడ్డి పెళ్లికి వెళ్తున్న విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు కృష్ణగిరి శివారు ప్రాంతంలో మాటు వేశారు. కల్వర్టు వద్ద ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఒక్కసారిగా కారుపైకి బాంబులు విసిరారు. ఊహించని పరిణామం నుంచి వారు తేరుకోకముందే దాదాపు 15 మంది చుట్టుముట్టి కత్తలు, వేటకొడవళ్లతో నరికేశారు.

దాడిలో నారాయణరెడ్డి అనుచరులు సాంబశివుడు కూడా చనిపోయారు. దాడి సమయంలో నారాయణరెడ్డి ఫార్చూనర్‌ కారులో మొత్తం ఐదుగురు ఉన్నారు. మిగిలిన వారు పారిపోయారు. నారాయణరెడ్డిని కత్తులతో నరికిన హంతకులు.. అనంతరం అతడి తలపై బండరాళ్లతోనూ మోదారు. ఈ దాడి పట్ల కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరిత, ఐజయ్యలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాలో వరుసగా రాజకీయ హత్యలు జరుగుతున్నా టీడీపీ ఒత్తిడికి లొంగి పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని వారు ఆరోపించారు.

చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా జిల్లాలో ఫ్యాక్షన్ హత్యలు మొదలువుతున్నాయని మండిపడ్డారు. 20 రోజుల క్రితమే ఆళ్లగడ్డలో ఇద్దరు వైసీపీ నేతలను హత్య చేస్తే ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చేయలేదని వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో వరుసగా హత్యలు జరుగుతున్నా, ప్రాణహానీ ఉందంటూ నేతలే చెబుతున్నా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏం చేస్తోందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం కేఈ నియోజకవర్గంలోనే ఈ హత్యలు జరుగుతుంటే ఇక భద్రత ఎక్కడ ఉందన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *