బెంగళూరు పై కోల్‌కతా ఘనవిజయం

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సొంతగడ్డపై కూడా కలిసిరాలేదు. వరుస పరాజయాల పరంపరను కొనసాగిస్తూ కోహ్లీసేన..మాజీ చాంపియన్ కోల్‌కతా చేతిలో చిత్తయ్యింది. పసలేని బౌలింగ్‌ను దిగ్విజయంగా కొనసాగించిన వేళ బెంగళూరు ఖాతాలో హ్యాట్రిక్ ఓటమి చేరింది. గెలుపు అసాధ్యమనుకున్న దశలో ఫించ్ హిట్టర్ యూసుఫ్ పఠాన్(29 బంతుల్లో 60, 6ఫోర్లు, 3సిక్స్‌లు) మెరుపులతో కోల్‌కతా చిరస్మరణీయ విజయాన్నందుకుంది. మరోవైపు వరుస ఓటముల నేపథ్యంలో ప్లేఆఫ్ అవకాశాలను బెంగళూరు మరింత సంక్లిష్టం చేసుకుంది. 186  పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు ఐదు వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. కోల్‌కతా ఆటగాళ్లు గౌతమ్‌ గంభీర్‌ (37), రస్సెల్‌ (39), పాండే (8), క్రిస్‌ లిన్నె (15), సూర్య కుమార్‌ యాదవ్‌ (10; నాటౌట్‌) గా నిలిచారు. కాగా, బెంగళూరు బౌలర్లు బిన్ని, అరవింద్‌, వాట్సన్‌ తలో వికెట్‌ తీసుకోగా, చాహల్‌ రెండు వికెట్లు తీసుకున్నాడు.

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు ఆదిలోనే క్రిస్ గేల్(7) వికెట్ ను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(52;32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడగా, అతనికి జతగా కెప్టెన్ విరాట్ కోహ్లి(52;44 బంతుల్లో 4 ఫోర్లు) మరోసారి బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడీ 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన అనంతరం రాహుల్ రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు.

ఆ తరువాత ఏబీ డివిలియర్స్(4) నిరాశపరచడంతో బెంగళూరు 109 పరుగుల వద్ద మూడో వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో క్రీజ్ లోకి వచ్చిన షేన్ వాట్సన్(34;21 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్) ఆకట్టుకున్నాడు. చివర్లో సచిన్ బేబి(16;8 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్స్),స్టువర్ట్ బిన్నీ(16;4 బంతుల్లో 1 ఫోర్, 2సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి  185 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో మోర్నీ మోర్కెల్, పీయూష్ చావ్లాలకు తలో రెండు వికెట్లు దక్కగా, ఆండ్రీ రస్సెల్, ఉమేష్ యాదవ్ లు తలో వికెట్ తీశారు.

స్కోరుబోర్డు
బెంగళూరు: రాహుల్ (సి) పఠాన్ (బి) చావ్లా 52, గేల్ (సి) ఊతప్ప (బి)మోర్కెల్ 7, కోహ్లీ (సి) రస్సెల్ (బి) మోర్కెల్ 52, డివిలియర్స్ (ఎల్బీ) చావ్లా 4, వాట్సన్ (రనౌట్/పాండే/ఊతప్ప) 34, సచిన్ (సి&బి) రస్సెల్ 16, బిన్ని (సి) పాండే (బి) ఉమేశ్ 16, ఆరోన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 185/7; వికెట్లపతనం: 1-8, 2-92, 3-109, 4-129, 5-167, 6-184, 7-185; బౌలింగ్: రస్సెల్ 4-0-24-1, మోర్కెల్ 4-0-28-2, నారాయణ్ 4-0-45-0, ఉమేశ్ యాదవ్ 4-0-56-1, చావ్లా 4-0-32-2.

కోల్‌కతా: ఊతప్ప (సి) కోహ్లీ (బి) బిన్నీ 1, గంభీర్ (ఎల్బీ) అరవింద్ 37, లిన్ (బి) చాహల్ 15, పాండే (సి) సచిన్ (బి) వాట్సన్ 8, యూసుఫ్ పఠాన్ (నాటౌట్) 60, రస్సెల్ (సి) బిన్నీ (బి) చాహల్ 39, సూర్యకుమార్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 19.1 ఓవర్లలో 189/5; వికెట్లపతనం: 1-6, 2-34, 3-66, 4-69, 5-165; బౌలింగ్: బిన్నీ 2-0-17-1, అరవింద్ 2.1-0-16-1, వాట్సన్ 3-0-38-1, చాహల్ 4-0-27-2, ఆరోన్ 4-0-34-0, షంసీ 4-0-51-0.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *