ధోనీ సేనకు షాక్ -జింబాబ్వే ఉత్కంఠ విజయం

జింబాబ్వే తొలి టీ20 మ్యాచ్‌లో ధోనీసేనకు షాకిస్తూ రెండు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆతిథ్య జింబాబ్వే 1-0తో ముందంజ వేసింది. తొలుత టీమ్‌ఇండియాకు టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.
ఎల్టన్ చిగుంబుర(26 బంతుల్లో 54 నాటౌట్, ఫోర్, 7సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీతో జట్టుకు పోరాడే స్కోరు దక్కింది. చిగుంబురతో పాటు వాలర్(30), మసకద్జ(25) ఆకట్టుకున్నారు. బుమ్రా(2/24) ఆకట్టుకోగా, రిషీధవన్(1/42), అక్షర్‌పటేల్(1/18), చాహల్(1/38) ఒక్కో వికెట్ తీశారు. జింబాబ్వే నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా 6 వికెట్లు చేజార్చుకుని 168 పరుగులు చేసింది. అరంగేట్రం ఆటగాడు రాహుల్(0) ఇన్నింగ్స్ మొదటి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత మణ్‌దీప్‌సింగ్(31), రాయుడు(19) రెండో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. అయితే వీరద్దరు వెంటవెంటనే నిష్క్రమించడంతో జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. మిడిలార్డర్‌లో మనీశ్‌పాండే(48) ఆకట్టుకున్నా.. ఆఖర్లో కెప్టెన్(19 నాటౌట్)కు అండగా నిలిచే బ్యాట్స్‌మెన్ కరువవడంతో జట్టు ఓటమి కొనితెచ్చుకుంది. అజేయ అర్ధసెంచరీతో జట్టుకు స్కోరందించిన చిగుంబురకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సోమవారం జరుగుతుంది.

Videos

18 thoughts on “ధోనీ సేనకు షాక్ -జింబాబ్వే ఉత్కంఠ విజయం

Leave a Reply

Your email address will not be published.